'కోహ్లి మాటలు నాకు కోపం తెప్పించాయి'

26 Feb, 2021 18:22 IST|Sakshi

అహ్మదాబాద్: మొటేరా‌ వేదికగా జరిగిన పింక్‌ బాల్‌ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియాలో విజయం వెనుక పిచ్‌ కీలకపాత్ర పోషించిందంటూ పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. పిచ్‌ పరిస్థితి దారుణంగా ఉందని.. అసలు ఆడుతుంది టెస్టు మ్యాచ్‌ లేక టీ20 మ్యాచ్‌ అన్న అనుమానం కలిగిందంటూ పేర్కొన్నారు. కాగా ఈ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించి నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది.

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గురువారం మ్యాచ్‌ విజయం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ''పిచ్‌లో ఏం తప్పు లేదు.. బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం వల్లే మ్యాచ్‌ రెండు రోజుల్లో ముగిసింది. నిజాయితీగా చెప్పాలంటే ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటింగ్‌ నాణ్యతలో లోపం ఉంది. మొదటి రోజు 3 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసి ఆటను ముగించాం. కానీ రెండో రోజు దానికి మరో 46 పరుగులు మాత్రమే జత చేసి మిగతా ఏడు వికెట్లు కోల్పోయాం. ఇదే విషయం ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌లోనూ నిజమైంది. వాస్తవానికి తొలి ఇన్నింగ్స్‌ సమయంలో పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉంది. మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి కోల్పోయిన 30 వికెట్లలో 21 వికెట్లు నేరుగా విసిరిన బంతులకే పడడం నాకు ఆశ్చర్యం కలిగించింది. మన డిఫెన్స్‌పై నమ్మకం పెట్టుకోకకుండా పిచ్‌ను నిందించడం సరికాదు. టెస్టు క్రికెట్‌లో నెమ్మైదన ఆట ఆడడం ప్రధానం. అలా ఆడకపోవడం.. పరుగులు చేయలేకపోవడం వల్లే మ్యాచ్‌ రెండు రోజుల్లో ముగిసింది'' అని తెలిపాడు. 

తాజాగా కోహ్లి వ్యాఖ్యలను తప్పుబడుతూ ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు అలిస్టర్‌ కుక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''కోహ్లి వ్యాఖ్యలు నాకు కోపం తెప్పించాయి. పింక్‌ బాల్‌ టెస్టులో పిచ్‌ తప్పు  ఏం లేదని.. బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం ప్రధాన కారణమని అంటున్నాడు. ఇది తప్పు.. స్పిన్‌ బాగా ఆడగలడని పేరున్న కోహ్లి, జో రూట్‌లు కూడా మూడో‌ టెస్టులో ఆత్మరక్షణ ధోరణిలో పడ్డారు. పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతూ ఢిఫెన్స్‌ మోడ్‌కు ఇద్దరు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు.  నిజానికి మొటేరా పిచ్‌ బ్యాటింగ్‌ చేయడానికి ఏ మాత్రం అనువుగా లేదు. బంతులన్ని వికెట్ల మీదకు వస్తుంటే ఏ బ్యాట్స్‌మెన్‌ అయినా ఎలా ఆడగలుగుతాడు.. ఈ విషయం తెలిసి కూడా కోహ్లి బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం అనడం నచ్చలేదు.'' అంటూ చురకలంటించాడు. 
చదవండి: స్వదేశం.. విదేశం.. రెండింట్లో కోహ్లినే టాప్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు