'నా నిర్ణయం వ్యతిరేకిస్తారా.. ఇప్పుడు చూడండి'

25 Feb, 2021 17:37 IST|Sakshi

కరాచీ: క్రికెట్‌లో డీఆర్‌ఎస్‌ రూల్స్‌ ప్రవేశపెట్టాకా ఫీల్డ్‌ అంపైర్ల నిర్ణయాలకు ప్రాధాన్యం తగ్గిపోయింది. ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయం ఒకసారి అనుకూలంగా ఉంటే మరోసారి వ్యతిరేకంగా ఉంటాయి. వారిచ్చిన నిర్ణయం నచ్చకపోతే రివ్యూ కోరే అవకాశాన్ని ఇరు జట్ల ఆటగాళ్లకు కల్పించారు. అయితే కొన్ని సందర్భాల్లో నాటౌట్‌ అని తెలిసి కూడా ఫీల్డ్‌ అంపైర్‌ మాట లెక్కచేయకుండా ఆటగాళ్లు రివ్యూలకు వెళుతుంటారు. రివ్యూ వ్యతిరేకంగా రాగానే ఆటగాళ్లు నిరాశకు లోనవుతుంటారు. ఇది ఇప్పటికే చాలాసార్లు నిరుపితమైంది. అదే సమయంలో ఫీల్డ్‌ అంపైర్‌ తన నిర్ణయం సరైందని తెలిసి లోలోపల సంతోషిస్తుంటారే తప్ప ఎమోషన్స్‌ను బయట పడనివ్వరు. తాజాగా సీనియర్‌ అంపైర్‌ అలీమ్‌ దార్‌ మాత్రం ఎమోషన్‌ను దాచుకోలేకపోయారు.

అసలు విషయంలోకి వెళితే.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో భాగంగా బుధవారం ఇస్లామాబాద్‌ యునైటెడ్స్‌, కరాచీ కింగ్స్‌ మధ్య లీగ్‌ మ్యాచ్‌ జరిగింది. ఇస్లామాబాద్‌ యునైటెడ్స్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కేవలం ఒక్క పరుగు చేస్తే ఇస్లామాబాద్‌ విజయం సాధిస్తుంది. మక్సూద్‌ వేసిన తొలి బంతిని ఆసిఫ్‌ అలీ థర్డ్‌ మన్‌ దిశగా ఫ్లిక్‌ చేసి పరుగు పూర్తి చేశాడు. అయితే మక్సూద్‌ అలీ బంతి ప్యాడ్‌కు తాకి వెళ్లిందోమోనన్న అనుమానంతో ఎల్బీకి అప్పీల్‌ చేశాడు. అయితే బంతి ప్యాడ్లను తాకినా వికెట్లకు చాలా ఎత్తులో నుంచి వెళుతుండడంతో ఫీల్డ్‌ అంపైర్‌ అలీమ్‌ దార్‌ నాటౌట్‌ అని పేర్కొన్నాడు. దీంతో కరాచీ కింగ్స్‌ డీఆర్‌ఎస్‌కు వెళ్లింది. అయితే రిప్లేలో కూడా బంతి అల్ట్రా ఎడ్జ్‌ తీసుకొని వికెట్ల పైనుంచి వెళుతున్నట్లు తేలింది. దీంతో థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌ అని ఇచ్చాడు.  దీంతో ఇస్లామాబాద్‌ సంబరాల్లో మునిగిపోగా.. కరాచీ కింగ్స్‌కు నిరాశే ఎదురైంది.

అయితే తాను చెప్పినా వినకుండా కరాచీ కింగ్స్‌ రివ్యూకు వెళ్లిందన్న కారణంతో అలీమ్‌ దార్‌ .. యా.. నేనే విజయం సాధించా.. అన్నట్లు సైగలు చేశాడు. అలీమ్‌ దార్‌ చర్యను ఎవరో వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఇస్లామాబాద్‌ యునైటెడ్స్‌ కరాచీ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కరాచీ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇస్లామాబాద్‌ 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఇస్లామాబాద్‌ బ్యాటింగ్‌లో అలెక్స్‌ హేల్స్‌ 46, ఇఫ్తికర్‌ అహ్మద్‌ 49, హుస్సేన్‌ తలాత్‌ 42 పరుగులతో రాణించారు.
చదవండి: డబుల్‌ సెంచరీ... పృథ్వీ షా సరికొత్త రికార్డు

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు