T20 World Cup 2022: చాప్టర్‌ క్లోజ్‌ అనుకున్న తరుణంలో హార్డ్‌ హిట్టర్‌కు జాక్‌పాట్‌.... మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ

7 Sep, 2022 17:15 IST|Sakshi

ఇంగ్లండ్‌ ఆటగాడు అలెక్స్‌ హేల్స్‌కు జాక్‌పాట్‌ తగిలింది. జట్టుకు దూరమై మూడేళ్లు కావొస్తుండడంతో ఇక చోటు కష్టమే అనుకుంటున్న తరుణంలో అలెక్స్‌ హేల్స్‌కు ఈసీబీ నుంచి పిలుపొచ్చింది. అక్టోబర్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక టి20 ప్రపంచకప్‌కు ఈసీబీ.. గాయంతో దూరమైన జానీ బెయిర్‌ స్టో స్థానంలో అలెక్స్‌ హేల్స్‌ను ఎంపిక చేసింది.

టి20 ప్రపం‍చకప్‌తో పాటు మెగాటోర్నీకి ముందు పాకిస్తాన్‌తో ఆడనున్న ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు కూడా హేల్స్‌కు చోటు దక్కింది. కాగా పాకిస్తాన్‌తో సెప్టెంబర్‌ 20, 22, 23, 25, 28, 30, అక్టోబర్‌ 2వ తేదీన ఇంగ్లండ్‌ ఏడు టి20లు ఆడనుంది. ఇక ప్రతిష్టాత్మక టి20 ప్రపం‍చకప్‌ అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది.

ఇక అలెక్స్‌ హేల్స్ 2019లో ఇంగ్లండ్‌ తరపున చివరి మ్యాచ్‌ ఆడాడు. 2019 వన్డే వరల్డ్‌కప్‌కు ముందు డ్రగ్స్‌ తీసుకున్నట్లుగా పాజిటివ్‌ రిపోర్ట్స్‌ రావడంతో జట్టుకు దూరమయ్యాడు. తాజాగా హార్డ్‌ హిట్టర్‌ జానీ బెయిర్‌ స్టో అనూహ్యంగా గాయంతో వైదొలగడంతో అలెక్స్‌ హేల్స్‌ మూడేళ్ల తర్వాత ఇంగ్లండ్‌ జట్టు తలుపులు తెరుచుకున్నాయి. ఇక​ బెయిర్‌ స్టో ఇటీవలే గోల్ఫ్‌ ఆడుతూ గాయపడ్డాడు. గోల్ఫ్‌ ఆడుతున్న తరుణంలో మోకాలు కింది భాగంలో తీవ్ర గాయం కావడంతో పాకిస్తాన్‌ సిరీస్‌తో పాటు టి20 ప్రపంచకప్‌కు చివరి నిమిషంలో దూరమయ్యాడు.

ఈ మధ్య కాలంలో అలెక్స్‌ హేల్స్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. 33 ఏళ్ల హేల్స్‌ ఇటీవలే జరిగిన హండ్రెడ్‌ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్‌-5 బ్యాటర్స్‌లో ఒకడిగా ఉన్నాడు. 2020 నుంచి చూసుకుంటే అలెక్స్‌ హేల్స్‌ టి20ల్లో 111 ఇన్నింగ్స్‌లో 3376 పరుగులు సాధించాడు. అతని కంటే ముందు పాకిస్తాన్‌ స్టార్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ 3435 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక టి20 క్రికెట్‌లో 10వేల పరుగుల మార్క్‌ను అందుకున్న క్రికెటర్ల జాబితాలో అలెక్స్‌ హేల్స్‌ చోటు దక్కించుకోవడం విశేషం. ఇక హేల్స్‌ ఇంగ్లండ్‌ తరపున 60 టి20ల్లో 1644 పరుగులు, 70 వన్డేల్లో 2419 పరుగులు, 11 టెస్టుల్లో 573 పరుగులు సాధించాడు.

చదవండి: పాక్‌ కెప్టెన్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లిన స్టార్‌ ఓపెనర్‌

Nick Kyrgios: వివాదం లేకుంటే మనసుకు పట్టదనుకుంటా.. నువ్వు మారవు!

మరిన్ని వార్తలు