Alexander Zvere: మతి తప్పిన జ్వెరెవ్‌.. టోర్నీ నుంచి గెంటేసిన నిర్వాహకులు

24 Feb, 2022 05:57 IST|Sakshi

రాకెట్‌తో అంపైర్‌ కుర్చీకేసి బాదిన ఒలింపిక్‌ చాంపియన్‌

మెక్సికో ఓపెన్‌ నుంచి గెంటివేసిన నిర్వాహకులు

అకాపుల్కో (మెక్సికో): ప్రపంచ మూడో ర్యాంకర్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) హద్దు మీరాడు. మెక్సికో ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో జ్వెరెవ్‌ తన రాకెట్‌తో అంపైర్‌ను దాదాపు కొట్టినంత పని చేశాడు. దాంతో జ్వెరెవ్‌ నిర్వాకంపై టోర్నీ నిర్వాహకులు క్రమశిక్షణ చర్య తీసుకున్నారు. టోర్నీలో అతను సింగిల్స్‌ మ్యాచ్‌ ఆడాల్సిన పనిలేదంటూ ఇంటికి పంపించేశారు. వివరాల్లోకి వెళితే... మంగళవారం రాత్రి జరిగిన డబుల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో జ్వెరెవ్‌ –మార్సెలో మెలో (బ్రెజిల్‌) జోడీ 2–6, 6–4, 6–10తో గ్లాస్‌పూల్‌ (బ్రిటన్‌)–హారి హెలియోవారా (ఫిన్‌లాండ్‌) జంట చేతిలో ఓడింది.

మ్యాచ్‌ సందర్భంగా అంపైర్‌ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన జ్వెరెవ్‌ తుది ఫలితం తర్వాత తన రాకెట్‌తో ఏకంగా చైర్‌ అంపైర్‌ కుర్చీకేసి బాదాడు. అంపైర్‌ తన కాళ్లను దగ్గరకు తీసుకోకపోతే కచ్చితంగా గాయమయ్యేది. ‘క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన జ్వెరెవ్‌ను టోర్నీ నుంచి తప్పించాం’ అని అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ తెలిపింది. మరోవైపు తన హద్దుమీరిన ప్రవర్తనపై జ్వెరెవ్‌ బుధవారం స్పందించాడు. చైర్‌ అంపైర్‌తోపాటు టోర్నీ నిర్వాహకులకు క్షమాపణలు చెప్పాడు.

మరిన్ని వార్తలు