Alexander Zverev: జ్వెరెవ్‌కు ఊరట.. జరిమానా, సస్పెన్షన్‌ నిలుపుదల

9 Mar, 2022 00:24 IST|Sakshi

అకాపుల్కో(మెక్సికో): టోక్యో ఒలింపిక్స్‌ చాంపియన్, జర్మనీ స్టార్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌కు అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) నుంచి చెప్పుకోదగ్గ ఊరట లభించింది. ఏటీపీ జరిమానా, సస్పెన్షన్‌ వేటు నిలుపుదల చేసింది. గత నెల మెక్సికో ఓపెన్‌లో డబుల్స్‌ మ్యాచ్‌ ఓడిన వెంటనే జ్వెరెవ్‌ చైర్‌ అంపైర్‌ కుర్చికేసి బలంగా తన రాకెట్‌ విరిగేలా పదేపదే కొట్టాడు. దీంతో టోర్నీ నిర్వాహకులు సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ అయిన జ్వెరెవ్‌ను పంపించేశారు. దాంతో పాటు 40 వేల డాలర్లు (రూ. 30 లక్షలు), ఆ టోర్నీలో పొందిన ఏటీపీ పాయింట్లను జరిమానాగా విధించారు.

ఇది పూర్తిగా మెక్సికో ఓపెన్‌కు సంబంధించిన పెనాల్టీ అయితే... ఏటీపీ నుంచి మరో 25 వేల డాలర్లు (రూ. 19 లక్షల 25 వేలు) జరిమానా, 8 వారాల సస్పెన్షన్‌ వేటు కూడా వేశారు. తాజాగా ఏటీపీ ఈ శిక్షను తాత్కా లికంగా నిలిపివేసి, ఏడాది పాటు ప్రొబేషన్‌లో ఉంచింది. అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి 22తో ముగిసే ప్రొబేషన్‌ వరకు అతని ప్రవర్తన హుందాగా ఉంటే ఏ సమస్యా లేదు. ఏటీపీ శిక్ష కూడా ఉండదు. ఈ ప్రొబేషన్‌ కాలంలో జ్వెరెవ్‌ తన అనుచిత ప్రవర్తనను పునరావృతం చేస్తే మాత్రం ఏటీపీ శిక్షను తక్షణం అమలు చేస్తారు. 

మరిన్ని వార్తలు