జ్వెరెవ్‌ జోరు

10 Sep, 2020 05:35 IST|Sakshi

తొలిసారి యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలో సెమీస్‌కు

క్వార్టర్‌ ఫైనల్లో చోరిచ్‌పై విజయం

కరెనో బుస్టాతో సెమీస్‌ పోరు

న్యూయార్క్‌: ‘బిగ్‌ త్రీ’ నీడలో ఇన్నాళ్లూ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ వేటలో వెనుకబడిపోయిన జర్మనీ యువతార అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా మరో అడుగు వేశాడు. యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో 23 ఏళ్ల జ్వెరెవ్‌ తొలిసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. 27వ సీడ్‌ బొర్నా చోరిచ్‌ (క్రొయేషియా)తో జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో జ్వెరెవ్‌ 1–6, 7–6 (7/5), 7–6 (7/1), 6–3తో గెలుపొందాడు. 1995లో బోరిస్‌ బెకర్‌ తర్వాత యూఎస్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌ చేరిన తొలి జర్మనీ ప్లేయర్‌గా జ్వెరెవ్‌ నిలిచాడు.  

జూనియర్‌స్థాయి నుంచి తన ప్రత్యర్థిగా ఉన్న చోరిచ్‌తో 3 గంటల 25 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో జ్వెరెవ్‌ తొలి సెట్‌లో తేలిపోయాడు. మూడు డబుల్‌ ఫాల్ట్‌లు, 12 అనవసర తప్పిదాలు చేయడంతోపాటు తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి సెట్‌ను చేజార్చుకున్నాడు. అయితే రెండో సెట్‌ నుంచి జ్వెరెవ్‌ గాడిలో పడ్డాడు. ఈ సెట్‌లో ఇద్దరూ ఒక్కోసారి తమ సర్వీస్‌లను కోల్పోయారు. చివరకు టైబ్రేక్‌లో జ్వెరెవ్‌ పైచేయి సాధించాడు. మూడో సెట్‌లోనూ ఇద్దరూ ఒక్కోసారి తమ సర్వీస్‌లను కోల్పోయారు. చివరకు టైబ్రేక్‌లోనే ఫలితం వచ్చింది. ఈసారీ జ్వెరెవ్‌ ఆధిక్యం కనబరిచాడు. టైబ్రేక్‌లో రెండు సెట్‌లను కోల్పోయిన చోరిచ్‌ నాలుగో సెట్‌లో తడబడ్డాడు. ఎనిమిదో గేమ్‌లో చోరిచ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 5–3తో ఆధిక్యంలోకి వెళ్లిన జ్వెరెవ్‌ ఆ తర్వాత తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 6–3తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు ఆడిన జ్వెరెవ్‌ కేవలం రెండోసారి మాత్రమే సెమీఫైనల్‌ దశకు అర్హత సాధించాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తొలిసారి అతను సెమీస్‌ చేరి డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) చేతిలో ఓడిపోయాడు. యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో చోటు కోసం సెమీఫైనల్లో 20వ సీడ్‌ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్‌)తో జ్వెరెవ్‌ ఆడతాడు.

బుస్టా పోరాటం...
ప్రిక్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ (సెర్బియా)తో తొలి సెట్‌లో 6–5తో ఆధిక్యంలో ఉన్న దశలో జొకోవిచ్‌ కోపంలో బంతిని వెనక్కి కొట్టడం... అదికాస్తా లైన్‌ జడ్జికి తగలడంతో... నిర్వాహకులు జొకోవిచ్‌పై అనర్హత వేటు వేశారు. దాంతో పూర్తిస్థాయి మ్యాచ్‌ ఆడకుండానే కరెనో బుస్టా క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకున్నాడు. అయితే క్వార్టర్‌ ఫైనల్లో కరెనో బుస్టాకు 12వ సీడ్‌ డెనిస్‌ షపోవలోవ్‌ (కెనడా) నుంచి గట్టిపోటీ ఎదురైంది. 4 గంటల 8 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో కరెనో బుస్టా 3–6, 7–6 (7/5), 7–6 (7/0), 0–6, 6–3తో గెలుపొంది సెమీఫైనల్లోకి ప్రవేశించాడు.

ఒసాకా అలవోకగా...
కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై గురి పెట్టిన జపాన్‌ క్రీడాకారిణి నయోమి ఒసాకా సెమీఫైనల్‌ చేరింది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ ఒసాకా 6–3, 6–4తో షెల్బీ రోజర్స్‌ (అమెరికా)పై గెలిచి సెమీఫైనల్లో 28వ సీడ్‌ జెన్నిఫర్‌ బ్రేడీ (అమెరికా)తో పోరాటానికి సిద్ధమైంది. షెల్బీ రోజర్స్‌తో 80 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఒసాకా ఏడు ఏస్‌లు సంధించి, మూడు బ్రేక్‌ పాయింట్లు సాధించింది.

సెమీస్‌లో సెరెనా
అమెరికా స్టార్‌ సెరెనా వరుసగా 11వ సారి యూఎస్‌ ఓపెన్‌లో సెమీస్‌ చేరింది. బుధవారం రాత్రి జరిగిన క్వార్టర్స్‌లో మూడో సీడ్‌ సెరెనా 4–6, 6–3, 6–2తో స్వెతానా పిరన్‌కోవా (బల్గేరియా)పై గెలిచింది. తొలి సెట్‌ను కోల్పోయిన సెరెనా వెంటనే కోలుకుంది. రెండో సెట్‌లోని ఎనిమిదో గేమ్‌లో పిరన్‌కోవా సర్వీస్‌ను బ్రేక్‌ చేసి ఆ తర్వాత  తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 6–3తో సెట్‌ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో సెట్‌లోని తొలి గేమ్‌లో, ఏడో గేమ్‌లో పిరన్‌కోవా సర్వీస్‌లను బ్రేక్‌ చేసిన సెరెనా ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు