లక్ష్యం చేరలేదు..!

21 Mar, 2022 05:06 IST|Sakshi

ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ రన్నరప్‌ లక్ష్య సేన్‌

ఫైనల్లో అక్సెల్‌సన్‌ చేతిలో పరాజయం

బర్మింగ్‌హామ్‌: ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ గెలిచిన మూడో భారతీయుడిగా నిలవాలని ఆశించిన భారత యువతార లక్ష్య సేన్‌కు నిరాశే ఎదురైంది. టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన లక్ష్య సేన్‌ బలమైన ప్రత్యర్థి ముందు నిలవలేక ఓటమి పాలయ్యాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో వరల్డ్‌ నంబర్‌వన్, టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత విక్టర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌) 21–10, 21–15 స్కోరుతో లక్ష్య సేన్‌పై విజయం సాధించి రెండోసారి ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించాడు.

2020లోనూ అక్సెల్‌సన్‌ ఈ టోర్నీలో విజేతగా నిలిచాడు. 53 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో కొన్నిసార్లు లక్ష్య సేన్‌ దీటుగా పోరాడినా తుది ఫలితం మాత్రం ప్రతికూలంగా వచ్చింది. గత ఏడాది ఇదే టోర్నీ ఫైనల్లో అనూహ్యంగా ఓటమి పాలై రన్నరప్‌గా సంతృప్తి చెందిన అక్సెల్‌సన్‌ ఈసారి తన స్థాయికి తగ్గ ఆటతో చాంపియన్‌ అయ్యాడు. విజేత అక్సెల్‌సన్‌కు 70 వేల డాలర్లు (రూ. 53 లక్షల 17 వేలు), రన్నరప్‌ లక్ష్య సేన్‌కు 34 వేల డాలర్లు (రూ. 25 లక్షల 83 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  

సుదీర్ఘ ర్యాలీలతో...
ఫైనల్‌ పోరుకు ముందు అక్సెల్‌సన్‌తో ముఖాముఖి సమరాల్లో లక్ష్య 1–4తో వెనుకంజలో ఉన్నాడు. అయితే ఆ ఒక్క విజయం ఎనిమిది రోజుల ముందే జర్మన్‌ ఓపెన్‌లో సెమీఫైనల్లో వచ్చింది. దాంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న సేన్‌పై అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అయితే విక్టర్‌ ఆరంభంలోనే సేన్‌ను దెబ్బ కొట్టాడు. వరుస పాయింట్లతో దూసుకుపోయిన అతను 6–0తో ముందంజలో నిలిచిన తర్వాత గానీ లక్ష్య తొలి పాయింట్‌ సాధించలేకపోయాడు.

తొలి గేమ్‌ మొత్తం దాదాపు ఇదే తరహాలో సాగింది. అక్సెల్‌సన్‌ ఆధిపత్యం ముందు సేన్‌ జవాబివ్వలేకపోయాడు. 2–8 వద్ద 61 షాట్‌ల ర్యాలీ కూడా రావడంతో సేన్‌ బాగా అలసిపోయాడు. చక్కటి డిఫెన్స్‌ ప్రదర్శిస్తూ 11–2తో ముందంజ వేసిన డానిష్‌ ఆటగాడు దానిని కొనసాగిస్తూ అలవోకగా తొలి గేమ్‌ను గెలుచుకున్నాడు. రెండో గేమ్‌లో సేన్‌ కొంత పోటీనిచ్చాడు. ముఖ్యంగా అతని స్మాష్‌లు మంచి ఫలితాలనిచ్చాయి. అయితే 4–4తో సమంగా ఉన్న స్థితి నుంచి అక్సెల్‌సన్‌ 11–5 వరకు తీసుకుపోగా, విరామం తర్వాత కోలుకొని వరుసగా మూడు పాయింట్లు సాధించి సేన్‌ 9–12తో అంతరాన్ని తగ్గించాడు.

ఈ దశలో విక్టర్‌ మళ్లీ చెలరేగి 10–17తో ఆధిక్యంలో నిలిచాడు. ఈ సమయంలో ఇద్దరు హోరాహోరీగా తలపడుతూ 70 షాట్‌ల ర్యాలీ ఆడగా, సేన్‌కు పాయింట్‌ దక్కి స్కోరు 11–17కు చేరింది. అయితే చివర్లో లక్ష్య మూడు మ్యాచ్‌ పాయింట్లు కాపాడుకున్నా... అప్పటికే ఆలస్యమైపోయింది. అనుభవలేమి, ఒత్తిడిలో ఓటమి పాలైనా... వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన తర్వాత ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలవడం 20 ఏళ్ల లక్ష్య సేన్‌ కెరీర్‌కు కొత్త ఉత్సాహాన్నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని వార్తలు