Tokyo Olympics: అందరి దృష్టి నీరజ్‌పైనే 

7 Aug, 2021 02:58 IST|Sakshi

నేడు జావెలిన్‌ త్రో ఫైనల్‌

అథ్లెటిక్స్‌లో ఊరిస్తోన్న ఒలింపిక్‌ పతకాన్ని భారత్‌కు ఈసారైనా లభిస్తుందా లేదా అనేది నేడు తేలిపోతుంది. పురుషుల జావెలిన్‌ త్రో ఫైనల్లో భారత ప్లేయర్‌ నీరజ్‌ చోప్రా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. హరియాణాకు చెందిన 23 ఏళ్ల నీరజ్‌ చోప్రా క్వాలిఫయింగ్‌లో జావెలిన్‌ను 86.59 మీటర్ల దూరం విసిరి ‘టాపర్‌’గా నిలువడంతో అందరి దృష్టి అతనిపైనే కేంద్రీకృతమైంది.

నీరజ్‌ ఫైనల్లోనూ తన ప్రావీణ్యాన్ని పునరావృతం చేసి పతకం సాధిస్తాడా లేదా అనేది నేటి సాయంత్రానికల్లా తెలిసిపోతుంది. నీరజ్‌తోపాటు జోనస్‌ వెటెర్‌ (జర్మనీ), జాకుబ్‌ వాద్లెచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌), వితెస్లా వెసిలీ (చెక్‌ రిపబ్లిక్‌), వెబెర్‌ (జర్మనీ) కూడా పతకాల రేసులో ఉన్నారు.  12 మంది పోటీపడుతున్న ఈ ఫైనల్లో తొలుత అందరికీ మూడు అవకాశాలు లభిస్తాయి. టాప్‌–8లో నిలిచిన వారికి మరో మూడు అవకాశాలు ఇస్తారు. అనంతరం టాప్‌–3లో నిలిచిన వారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు ఇస్తారు. 

మరిన్ని వార్తలు