ODI Captain: టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ.. బీసీసీఐ అధికారిక ప్రకటన

9 Dec, 2021 10:23 IST|Sakshi

వన్డే సారథ్యం రోహిత్‌ చేతికి

విరాట్‌ కోహ్లిపై వేటు వేసిన సెలక్టర్లు

టెస్టు వైస్‌ కెప్టెన్సీ కూడా రోహిత్‌కే

భారత క్రికెట్‌లో కీలక మార్పు

ODI Captain Rohit Sharma: భారత వన్డే క్రికెట్‌లో కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి శకం ముగిసింది. అత్యంత విజయవంతమైన సారథుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నా, ఇకపై వన్డేల్లో అతని నాయకత్వం అవసరం లేదని బీసీసీఐ భావించింది. కొన్నాళ్ల క్రితం టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నానంటూ స్వయంగా తానే ప్రకటించే అవకాశం కోహ్లికి ఇచ్చిన సెలక్టర్లు ఈసారి అదీ లేకుండా చేశారు. ఏ

కవాక్యంతో కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఊహించిన విధంగానే మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించే అవకాశం లేకుండా రోహిత్‌ శర్మనే వన్డే కెప్టెన్‌గా చేసి అతడికి మరో ప్రమోషన్‌ ఇచ్చారు. ఇటీవలే అధికారికంగా టి20 కెప్టెన్‌ బాధ్యతలు స్వీకరించిన రోహిత్‌ను టెస్టుల్లోనూ మరో మెట్టు ఎక్కించారు. ఇప్పటి వరకు వైస్‌ కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానేను తప్పించి ఆ స్థానంలో రోహిత్‌కు వైస్‌ కెప్టెన్‌ను చేశారు. త్వరలో జరిగే దక్షిణాఫ్రికా పర్యటన నుంచి ఈ మార్పులు చోటు చేసుకోనుండగా... సఫారీ టీమ్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌ కోసం కూడా టీమ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.

ముంబై: డాషింగ్‌ ఓపెనర్, వన్డేల్లో మూడు డబుల్‌ సెంచరీలు సాధించిన ఘనత ఉన్న ఏకైక బ్యాటర్‌ రోహిత్‌ శర్మ పూర్తి స్థాయిలో భారత వన్డే జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. టి20లకు ఇప్పటికే కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ను వన్డేలకు కూడా నియమిస్తున్నట్లు సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. 34 ఏళ్ల రోహిత్‌ కనీసం 2023లో భారత గడ్డపైనే జరిగే వన్డే వరల్డ్‌కప్‌ వరకు సారథిగా కొనసాగే అవకాశం ఉంది. రోహిత్‌ టి20 కెప్టెన్‌గా ఎంపికైనప్పటి నుంచే వన్డే కెప్టెన్సీపై కూడా చర్చ కొనసాగుతోంది. పరిమిత ఓవర్ల రెండు ఫార్మాట్‌లకు ఒకే కెప్టెన్‌ బాగుంటుందనే సూచన చాలాసార్లు వినిపించింది.

అయితే బ్యాటర్‌గా విరాట్‌ కోహ్లి స్థాయి, కెప్టెన్‌గా అతని మెరుగైన రికార్డు చూస్తే ఇంత తొందరగా మార్పు జరగడం మాత్రం ఆశ్చర్యకరం. మరో కోణంలో చూస్తే 2023 వన్డే వరల్డ్‌కప్‌కు ముందు కెప్టెన్‌గా తగినంత సమయం ఇచ్చి తన జట్టును తీర్చి దిద్దుకునే అవకాశం ఇవ్వడం సరైందిగా బోర్డు భావించి ఉంటుంది. ఇకపై కోహ్లి టెస్టు కెప్టెన్‌గా మాత్రమే కొనసాగుతాడు. అతని సారథ్యంలోనే జట్టు దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల్లో ఆడుతుంది. ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న రహానే... జట్టులో స్థానం నిలబెట్టుకున్నా వైస్‌ కెప్టెన్సీ కోల్పోయాడు. అతని స్థానంలోనే రోహిత్‌ను వైస్‌కెప్టెన్‌గా ఎంపిక చేశారు.   

దక్షిణాఫ్రికా పర్యటనకు జట్టు ప్రకటన 
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అవకాశం దక్కని హైదరాబాద్‌ బ్యాటర్‌ గాదె హనుమ విహారి దక్షిణాఫ్రికా సిరీస్‌కు మళ్లీ జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోనే ఉండి ‘ఎ’ జట్టు తరఫున ఆడుతున్న విహారి మూడు అనధికారిక టెస్టుల్లో మూడు అర్ధసెంచరీలు చేసి తన ఫామ్‌ను చాటాడు. సబ్‌స్టిట్యూట్‌ కీపర్‌గా కాన్పూర్‌ టెస్టుల్లో సత్తా చాటినా ఆంధ్ర ఆటగాడు శ్రీకర్‌ భరత్‌కు స్థానం లభించలేదు. గాయాల కారణంగా జడేజా, శుబ్‌మన్‌ గిల్, అక్షర్‌ పటేల్, రాహుల్‌ చహర్‌ పేర్లను పరిశీలించలేదని సెలక్టర్లు వెల్లడించారు.  
టెస్టు జట్టు: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ (వైస్‌ కెప్టెన్‌), రాహుల్, మయాంక్, పుజారా, రహానే, శ్రేయస్, విహారి, పంత్, సాహా, అశ్విన్, జయంత్, ఇషాంత్, షమీ, ఉమేశ్, బుమ్రా, శార్దుల్, సిరాజ్‌. 
స్టాండ్‌బై: నవదీప్‌ సైనీ, దీపక్‌ చహర్, అర్జన్‌ నాగ్‌వాస్‌వాలా, సౌరభ్‌ కుమార్‌.


చదవండి: బంగ్లాపై గెలుపు.. రెండో స్థానంలో పాక్‌

మరిన్ని వార్తలు