అన్ని జట్లు చేరుకున్నాయి

24 Aug, 2020 03:05 IST|Sakshi
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఆటగాళ్లు

దుబాయ్‌లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌

దుబాయ్‌: ఐపీఎల్‌ తాజా సీజన్‌ కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌), ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ) జట్లు ఆదివారం దుబాయ్‌ చేరుకున్నాయి. మిగతా జట్లన్నీ ఇప్పటికే అక్కడికి చేరుకోగా... ఈ రెండు జట్లు మాత్రం కాస్త ఆలస్యంగా యూఏఈ బయలుదేరి వెళ్లాయి. తొలుత హైదరాబాద్, అనంతరం ఢిల్లీ జట్లు దుబాయ్‌లో అడుగుపెట్టాయి. ఈ విషయాన్ని సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మన్‌ శ్రీవత్స్‌ గోస్వామి ట్విట్టర్‌లో తెలిపాడు. మరోవైపు చాలా కాలం తర్వాత తమ జట్టుతో కలిసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ధీరజ్‌ మల్హోత్రా, అసిస్టెంట్‌ కోచ్‌ మొహమ్మద్‌ కైఫ్‌ హర్షం వ్యక్తం చేశారు.

మళ్లీ కుటుంబంతో కలిసినట్లుగా చాలా ఉత్సాహంగా ఉందని ధీరజ్‌ పేర్కొన్నారు.  బీసీసీఐ నిబంధనల ప్రకారం ఈ రెండు జట్లు ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నాయి. ఈ సమయంలో మూడు సార్లు ఆటగాళ్లందరికీ ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించి నెగెటివ్‌గా తేలిన వారిని మాత్రమే ‘బయో బబుల్‌’లోకి అనుమతించనున్నారు.   సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు దుబాయ్, అబుదాబి, షార్జా వేదికల్లో ఐపీఎల్‌ 13వ సీజన్‌ జరుగనుంది. దీంతో లీగ్‌తో సంబంధమున్న భారత ఆటగాళ్లు, సిబ్బంది యూఏఈ చేరుకున్నారు.

ఆర్‌సీబీతో కలిసిన డివిలియర్స్‌ 
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) విధ్వంసక ఆటగాడు డివిలియర్స్‌ దుబాయ్‌ చేరుకున్నాడు. ఆర్‌సీబీ జట్టు శుక్రవారమే అక్కడికి చేరుకోగా  దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డేల్‌ స్టెయిన్, క్రిస్‌ మోరిస్, డివిలియర్స్‌ శనివారం జట్టుతో కలిశారు. ‘ఐపీఎల్‌ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. దుబాయ్‌కి రావడం సంతోషంగా ఉంది. నా దక్షిణాఫ్రికా మిత్రులతో కలిసి ఆర్‌సీబీ కుటుంబంలో చేరాను. ఇక కోవిడ్‌–19 పరీక్షకు హాజరు కావాలి’ అని డివిలియర్స్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు