కోహ్లి కెప్టెన్సీ స్కిల్స్‌ను బట్టే ఉంటుంది: గంగూలీ

7 Nov, 2020 20:40 IST|Sakshi

న్యూఢిల్లీ:  వచ్చే నెలలో  ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే టీమిండియా ప్రదర్శన అనేది విరాట్‌ కోహ్లి కెప్టెన్సీపై ఆధారపడి ఉందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పేర్కొన్నాడు. డిసెంబర్‌ 17వ తేదీన అడిలైడ్‌ వేదికగా జరుగనున్న ఆరంభపు మ్యాచ్‌లో భారత జట్టే ఫేవరెట్‌ అని గంగూలీ అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో సెంచరీలే విజయంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నాడు. కోహ్లి కెప్టెన్‌గా ఆస్ట్రేలియాలో ఎంత వరకూ సక్సెస్‌ సాధిస్తాడో అనే దాన్ని బట్టే భారత జట్టు భవితవ్యం ఆధారపడిందన్నాడు. ఇండియా టుడేతో మాట్లాడిన సౌరవ్‌ గంగూలీ..ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి కొన్ని విషయాలను షేర్‌ చేసుకున్నాడు. ‘ కచ్చితంగా టీమిండియా జట్టు నాణ్యమైన జట్టే. పేస్‌ ఎటాక్‌లో భారత్‌ చాలా పుంజుకుంది.

నవదీప్‌ సైనీ తన పేస్‌లో మరింత మెరుగయ్యాడు. గతేడాది కంటే సైనీ బౌలింగ్‌లో పదును పెరిగింది. ప్రతీ ఒక్కరితో మంచి ప్రదర్శన చేయడంపై కోహ్లి వర్క్‌ చేయాల్సి ఉంది. కెప్టెన్‌గా అతనకు ఏది మంచి అనిపిస్తే అది చేస్తాడు. ఎవర్ని తుది జట్టులోకి తీసుకుంటాడో అనేది కోహ్లిపైనే ఆధారపడి ఉంటుంది. బుమ్రా, సైనీ, ఇషాంత్‌ శర్మ, జడేజా, అశ్విన్‌ ఇలా ఎవర్ని తీసుకోవాలో అది కోహ్లి ఇష్టం. అది కెప్టెన్సీ స్కిల్‌పై ఉంటుంది. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలకు వెళుతున్నప్పుడు ఓపెనింగ్‌ అనేది చాలా కీలకం. ఇక్కడ ఎవర్ని ఎలా ఉపయోగిస్తాడో చూడాలి.ఓపెనింగ్‌ భాగస్వామ్యం కీలకమైనది. ఒకవేళ 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోతే అప్పుడు కోహ్లి లేదా రహానేలు దిగాలని మనం కోరుకోకూడదు. ఎందుకంటే అప్పటికీ బంతి ఇంకా కొత్తగానే ఉంటుంది. కమిన్స్‌, స్టార్క్‌, హజిల్‌వుడ్‌లు కొత్త బంతితో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి చూస్తారు’ అని గంగూలీ తెలిపాడు. అయితే ఇవన్నీ తాను బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో చెప్పడం లేదని, ఒక ఆటగాడిగా మాత్రమే సలహా ఇస్తున్నానని గంగూలీ అన్నాడు.
 

మరిన్ని వార్తలు