Formula One: నిమిషం ఆలస్యమయినా పరిస్థితి వేరుగా ఉండేది

23 Mar, 2022 14:49 IST|Sakshi

బహ్రెయిన్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌లో భాగంగా ఫార్ములావన్‌ డ్రైవర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ల్యాప్‌ జరుగుతుండగానే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఫార్ములావన్‌ డ్రైవర్‌ వెంటనే బయటకు దూకేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. గత ఆదివారం బహ్రెయిన్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ టోర్నీ జరిగింది. కుడేరియా ఆల్ఫాతౌరీ డ్రైవర్‌ పియర్ గ్యాస్లీ రేసులో పాల్గొన్నాడు.

మరో 10 ల్యాప్స్‌ ఉన్న సమయంలో పియర్‌ గ్యాస్లీ కారుకు మంటలు అంటుకున్నాయి. ఇది గమనించిన పియర్‌ వెంటనే కారును సైడ్‌కు తీసుకెళ్లి అందులో నుంచి బయటకు దూకేశాడు. చూస్తుండగానే మంటలు కారును మొత్తం చుట్టేశాయి. వెంటనే నిర్వహకులు వచ్చి మంటలు ఆర్పేశారు. కాగా పియర్‌ గ్యాస్లీ 46వ ల్యాప్‌ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కచ్చితంగా టాప్‌ 10లో ఉంటానని భావించిన పియర్‌కు ఇది ఊహించని ఫలితం అని చెప్పొచ్చు. 

ఇక ఆదివారం జరిగిన ఫార్ములావన్‌ సీజన్‌ తొలి రేసు బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ జట్టు డ్రైవర్‌ చార్లెస్‌ లెక్‌లెర్క్ విజేతగా నిలిచాడు. నిర్ణీత 57 ల్యాప్‌లను లెక్‌లెర్క్‌ ఒక గంట 37 నిమిషాల 33.584 సెకన్లలో పూర్తి చేసి కెరీర్‌లో మూడో విజయాన్ని అందుకున్నాడు. ఫెరారీకే చెందిన కార్లోస్‌ సెయింజ్‌ రెండో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్‌ వెర్‌స్టాపెన్‌ 54వ ల్యాప్‌లో వైదొలిగాడు.

చదవండి: Lewis Hamilton: టైటిల్‌ గెలవకపోయినా ప్రపం‍చ రికార్డు బద్దలు

Ashleigh Barty: టెన్నిస్‌ ప్లేయర్‌ యాష్లే బార్టీ షాకింగ్‌ నిర్ణయం.. 25 ఏళ్ల వయస్సులోనే

మరిన్ని వార్తలు