Ambati Rayudu IPL Retirement: సీఎస్‌కే షాకిచ్చిన స్టార్‌ క్రికెటర్‌.. అకస్మాత్తుగా రిటైర్మెంట్‌ ప్రకటన

14 May, 2022 13:36 IST|Sakshi
Photo Courtesy: IPL

Ambati Rayudu Retires From IPL: ఐపీఎల్‌ 2022 సీజన్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్‌కు అస్సలు కలిసి రాలేదు. వరుస గాయాలు, పరాజయాలు, కెప్టెన్సీ మార్పు, సీనియర్‌ ఆటగాళ్ల పేలవ ప్రదర్శన, అంపైరింగ్‌ తప్పిదాలు.. ఇలా ప్రతి ఒక్క విషయంలో ఆ జట్టును దురదృష్టం వెంటాడింది. వరుసగా పరాజయాలను ఎదుర్కొని ఆతర్వాత కెప్టెన్‌ మార్పుతో తిరిగి విన్నంగ్‌ ట్రాక్‌ ఎక్కినప్పటికీ.. కీలక మ్యాచ్‌లో దారుణ పరాజయాన్ని (ముంబై) మూటగట్టుకుని ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించింది. మరో రెండు మ్యాచ్‌లు ఆడితే ఈ సీజన్‌లో సీఎస్‌కే ప్రస్థానం ముగుస్తుంది.


ఇదిలా ఉంటే, లీగ్‌ నుంచి నిష్క్రమించిన బాధలో ఉన్న చెన్నై జట్టుకు మరో భారీ షాక్‌ తగిలింది. సీనియర్‌ ప్లేయర్‌, తెలుగు ఆటగాడు అంబటి రాయుడు ఈ సీజన్‌తో ఐపీఎల్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ట్విటర్‌ వేదికగా షాకింగ్‌ ప్రకటన చేశాడు. రాయుడు అకస్మాత్తుగా ఈ ప్రకటన చేయడంతో సీఎస్‌కే యాజమాన్యానికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ధోని, రాయుడు లాంటి సీనియర్లు వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉండకపోతే తమ పరిస్థితి ఏంటని వారు ఆలోచనలో పడ్డారు. 

మరో పక్క రాబిన్‌ ఉతప్ప, డ్వేన్‌ బ్రావో లాంటి వెటరన్‌లు కూడా రిటైర్మెంట్‌కు దగ్గర పడ్డారు. కెప్టెన్సీ వివాదం కారణంగా జడేజా కూడా సీఎస్‌కేతో బంధం తెంచుకుంటే ఆ జట్టు భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారనుంది. ప్రస్తుతానికి ఆ జట్టు ఆశలన్నీ రుతురాజ్‌ గైక్వాడ్‌, డెవాన్‌ కాన్వే, ముకేశ్‌ చౌదరీపైనే ఉన్నాయి. కాగా, అంబటి రాయుడుకి ఐపీఎల్‌లో సీఎస్‌కేతో చాలా అనుబంధం ఉంది. రాయుడు.. తన 13 ఏళ్ల క్యాష్‌ రిచ్‌ లీగ్‌ కెరీర్‌లో ముంబై ఇండియన్స్‌ తర్వాత అత్యధిక సీజన్‌లు సీఎస్‌కేతోనే ఉన్నాడు. ఐపీఎల్‌లో మొత్తం 187 మ్యాచ్‌లు ఆడిన రాయుడు 29.28 సగటున 4187 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 22 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: IPL 2022: ధోని తర్వాత సీఎస్‌కే కెప్టెన్‌గా రుతురాజ్‌..!
 

మరిన్ని వార్తలు