Ambati Rayudu Retirement: తూచ్‌.. రిటైర్‌ కావట్లేదు..! రిటైర్మెంట్‌ ట్వీట్‌ను డిలీట్‌ చేసిన అంబటి రాయుడు

14 May, 2022 16:15 IST|Sakshi

Ambati Rayudu Deletes Retirment Tweet: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు.. రిటైర్మెంట్‌ (ఐపీఎల్‌) విషయంలో మనసు మార్చుకున్నట్లున్నాడు. ఈ సీజన్‌ (2022) తర్వాత ఐపీఎల్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ఇవాళ (మే 14) ఉదయం ట్వీట్‌ చేసిన రాయుడు.. నిమిషాల వ్యవధిలో ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశాడు. రాయుడు ఇచ్చిన ఈ ట్విస్ట్‌తో అభిమానులు కన్ఫ్యూజన్‌లో పడిపోయారు. 

రాయుడు రిటైర్మెంట్‌పై సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్‌ స్పందించాడు. రాయుడు రిటైర్‌ కావట్లేదని క్లారిటీ ఇచ్చాడు. గత కొంత కాలంగా సరైన ప్రదర్శన చేయలేకపోతున్నానన్న బాధలో రాయుడు ఉన్నాడని,  ఆ నిరాశలోనే అతను రిటైర్మెంట్‌ ప్రకటన చేశాడని, వచ్చే సీజన్‌ కూడా రాయుడు తమతోనే ఉంటాడని వివరణ ఇచ్చాడు. 


36 ఏళ్ల రాయుడు ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో 12 మ్యాచ్‌ల్లో 27.10 సగటున 271 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో సంతృప్తి చెందకనే రాయుడు రిటైర్మెంట్‌ ప్రకటన చేసినట్లు సీఎస్‌కే సీఈవో పేర్కొన్నాడు.రాయుడు తన ట్వీట్‌లో ఈ విధంగా స్పందించాడు. 'ఐపీఎల్‌లో ఇదే నా ఆఖరు సీజన్ అని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరఫున తన 13 ఏళ్ల ఐపీఎల్‌ ప్రస్థానం చాలా సంతృప్తిని ఇచ్చింది.. ఆ రెండు జట్లతో గొప్ప క్షణాలు గడిపాను.. ముంబై, సీఎస్‌కేకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. 

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ (2010-2017), సీఎస్‌కే (2018 నుంచి) జట్లకు ప్రాతినిధ్యం వహించిన రాయుడు.. 187 మ్యాచ్‌ల కెరీర్‌లో 127.26 స్ట్రైయిక్‌ రేట్‌తో 29.28 సగటున 4187 పరుగులు చేశాడు. 2022 మెగా వేలంలో సీఎస్‌కే రాయుడుని 6.75 కోట్లకు తిరిగి దక్కించుకుంది. ఈ సీజన్‌లో సీఎస్‌కే తరఫున రుతురాజ్‌ (313 పరుగులు), శివమ్‌ దూబే (289) తర్వాత అత్యధిక పరుగులు చేసింది రాయుడే (271) కావడం విశేషం. 
చదవండి: సీఎస్‌కే షాకిచ్చిన స్టార్‌ క్రికెటర్‌.. అకస్మాత్తుగా రిటైర్మెంట్‌ ప్రకటన

మరిన్ని వార్తలు