రాయుడు అదరగొట్టాడు..

19 Sep, 2020 22:53 IST|Sakshi
అంబటి రాయుడు(ఫోటో కర్టసీ: బీసీసీఐ)

అబుదాబి:  చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు అంబటి రాయుడు బ్యాటింగ్‌లో సత్తాచాటాడు. తాను ఎంత విలువైన ఆటగాడో మరొకసారి నిరూపించుకున్నాడు.  ఫోర్లు, సిక్స్‌లే కాకుండా అత్యంత నిలకడతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌-13 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌ నిర్దేశించిన 163 లక్ష్య ఛేదనలో భాగంగా సీఎస్‌కే ఆరు పరుగులకే ఓపెనర్లు మురళీ విజయ్‌(1), షేన్‌ వాట్సన్‌(4) వికెట్‌లను ఆదిలోనే కోల్పోయినప్పటికీ రాయుడు మాత్రం చూడచక్కని షాట్లతో మెరిపించాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. (చదవండి: జడేజా మ్యాజిక్‌.. డుప్లెసిస్‌ సూపర్‌)

ఒకవైపు మంచి బంతుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా చెత్త బంతి అనిపిస్తే బౌండరీకి పంపించడానికి ఏమాత్రం వెనుకాడలేదు. బౌలర్‌ ఎవరైనా టైమింగ్‌తో దుమ్ములేపాడు.  ఈ క్రమంలోనే డుప్లెసిస్‌తో కలిసి వంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దాంతో సీఎస్‌కే 14.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసి ఒక్కసారిగా ట్రాక్‌లోకి వచ్చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వాట్సన్‌ను పాటిన్‌సన్‌ ఎల్బీగా పెవిలియన్‌కు పంపగా, మురళీ  విజయ్‌ను బౌల్ట్‌ ఎల్బీగా ఔట్‌ చేశాడు. దాంతో రెండో ఓవర్‌లోనే సీఎస్‌కే కష్టాల్లో పడింది. ఆ తరుణంలో రాయుడు-డుప్లెసిస్‌ల జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది.కాగా, 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 71 పరుగులు చేసిన తర్వాత రాయడు మూడో వికెట్‌గా ఔటయ్యాడు.

>
మరిన్ని వార్తలు