కోహ్లి.. నీకు అర్థమవుతోందా..?

21 Sep, 2020 11:11 IST|Sakshi

వెబ్‌స్పెషల్‌: మనిషికి తీవ్రమైన అసంతృప్తి నుంచి పుట్టేదే కోపం. ఎక్కడైనా మనకు చేదు అనుభవం ఎదురైతే దానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎదురుచూస్తాం. ఎక్కడైతే అవమానం జరిగిందని భావిస్తామో, అక్కడ అందుకు బదులు తీర్చుకోవాలని శాయశక్తులా ప్రయత్నిస్తాం. ఇప్పుడు ఇదే కోవలోకి వస్తాడు హైదరాబాద్‌ క్రికెటర్‌ అంబటి రాయుడు. గతేడాది వరల్డ్‌కప్‌ సందర్భంగా రాయుడికి జరిగిన అవమానం అంతా ఇంతా కాదు. అప్పటివరకూ జట్టులో చోటుపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నుంచి భరోసా వచ్చినా.. అది చివరినిమిషంలో తారుమారైంది. వరల్డ్‌కప్‌లో రాయుడ్ని ఆడించడం కోసమే ఎక్కువ మ్యాచ్‌లు ఆడించాం. రాయుడు నిరూపించుకుని నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు అని కోహ్లి చాలాసందర్భాల్లోనే చెప్పాడు.

నాల్గోస్థానంలో రాయుడి ఫిట్‌ అవుతాడో అంటూ కూడా ప్లేస్‌ను కూడా డిసైడ్‌ చేసేశాడు. ఇందుకు కారణం భారత క్రికెట్‌ జట్టుకు నాల్గో స్థానంలో ఉన్న లోటే. మరి తీరా చూస్తే చివరకు తుస్‌ మనిపించారు.  రాయుడు కాదు.. విజయ్‌ శంకర్‌ అంటూ ప్రాబబుల్స్‌ను ప్రకటించేశారు. అందుకు వివరణ కూడా ఇచ్చేశారు.. విజయ్‌ శంకర్‌ త్రీ డైమన్షన్‌ ప్లేయర్‌ అని కితాబు కూడా ఇచ్చేశారు. బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌ చేసే విజయ్‌ శంకర్‌ అద్భుతం చేస్తాడని ఆశించారు.  అది ఏమిటో చూడటానికి త్రీడీ కళ్లద్దాలకు ఆర్డర్‌ ఇచ్చానని రాయుడుకు మాటల యుద్ధానికి తెరలేపాడు.

అయితే విజయ్‌ శంకర్‌ చేసే మ్యాజిక్‌ను రాయుడే కాదు.. మనం ఎవరూ చూడకపోగా తిరిగి భారత్‌ ఫ్లయిట్‌ ఎక్కేశాడు. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లు ఆడి స్వదేశానికి వచ్చేశాడు. మరి అప్పుడైనా రిజర్వ్‌ ఆటగాళ్ల బెంచ్‌లో ఉన్న రాయుడికి చోటిచ్చారా అంటే అదీ లేదు. పెద్దగా అనుభవం లేని రిషభ్‌ పంత్‌ను ఇంగ్లండ్‌కు వచ్చేయమని కబురు పంపారు. పంత్‌ కూడా తుస్‌మనిపించాడు. ఒక మెగా టోర్నీకి వెళ్లే జట్టు కూర్పు సరిగా లేకపోవడంతో భారత్‌ సెమీస్‌లోనే నిష్క్రమించింది. ఒత్తిడిని జయించలేక సాధారణ లక్ష్యాన్ని కూడా సాధించలేక కోహ్లి అండ్‌ గ్యాంగ్‌ నాకౌట్‌ బెర్తుతోనే సరిపెట్టుకుంది.

రాయుడిలో అదే కోపం..
అప్పట్నుంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న అంబటి రాయుడు.. ఐపీఎల్‌ కోసం తీవ్రంగా ప్రాక్టీస్‌ చేశాడు. అందరికీ ముందుగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టి బ్యాటింగ్‌కు సానబెట్టాడు. ఇలా కొన్ని నెలల ప్రాక్టీస్‌ తర్వాత ఐపీఎల్‌కు వెళ్లిన రాయుడు తొలి మ్యాచ్‌లోనే మెరిశాడు. సీఎస్‌కే ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో రాయుడు ఇది నా బ్యాటింగ్‌ పవర్‌ అని నిరూపించాడు. ఎక్కడ తడబడకుండా 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 71 పరుగులు చేశాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కూడా దక్కించుకున్నాడు. ఆదిలోనే రెండు వికెట్లు పడటంతో సీఎస్‌కే పని అయిపోయిందనుకున్న వారికి తాను ఉన్నానంటూ బ్యాట్‌తో జవాబిచ్చాడు రాయుడు. నాల్గో స్థానంలో బ్యాటింగ్‌ దిగి డుప్లెసిస్‌తో కలిసి 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి సీఎస్‌కే విజయానికి బాటలు వేశాడు. ఐపీఎల్‌ ప్రాక్టీస్‌ దగ్గర్నుంచీ తొలి మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకోవడం వరకూ చూస్తూ రాయుడిలో పట్టుదల కనిపించింది. తనను వరల్డ్‌కప్‌కు ఎందుకు ఎంపిక చేయలేదనే కోపం కనిపించింది. జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇలా ఆడాలి బాస్‌ అనే కసి కనిపించింది.
(చదవండి: నా సక్సెస్‌ వెనుక కారణం అదే : రాయుడు)

ధోని-కోహ్లి కెప్టెన్సీల  అదే తేడా..
భారత క్రికెట్‌లో వీరిద్దరూ విజయవంతమైన కెప్టెన్లే. అటు ఆట పరంగానూ ఇటు కెప్టెన్సీ పరంగానూ ఇద్దరూ జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. కానీ ధోని కెప్టెన్సీకి కోహ్లి కెప్టెన్సీకి చాలా తేడా ఉంది.  ధోని కెప్టెన్సీ ముక్కుసూటిగా ఉంటుంది. ఫీల్డ్‌లో ఎంత మిస్టర్‌కూల్‌గా ఉంటాడో జట్టు ఎంపికలో మాత్రం కచ్చితత్వాన్ని పాటిస్తాడు ధోని. తనకు పలానా ప్లేయర్‌ కావాలి, పలానా ప్లేయర్‌ వద్దు అని నికార్సుగా చెబుతాడు. ఒకవేళ జట్టు కష్టాల్లో ఉంటే ముందుండి నడిపించే బాధ్యతను కూడా తీసుకుంటాడు ధోని. పలానా ప్లేస్‌లో వెళ్లాలనుకుంటే అది ప్లేస్‌లో వెళ్లి దానికి న్యాయం చేస్తాడు. అలా కాబట్టే ఒక టీ20 వరల్డ్‌కప్‌, ఒక వన్డే వరల్డ్‌కప్‌, ఒక చాంపియన్స్‌ ట్రోఫీని కూడా జట్టుకు సాధించిపెట్టాడు. మరి కోహ్లిలో దూకుడు ఫీల్డ్‌లోనే ఉంటుందనేది కాదనలేని సత్యం. జట్టు సెలక్షన్‌ విషయంలో కెప్టెన్‌గా తన మార్కు కనబడదు.

ఏదొక జట్టు ఆడేద్దాం.. అన్నట్లే ఉంటుంది. సెలక్టర్లు ఏది చెబితే ఓకే అనడమే కోహ్లికి తెలుసు. ప్రస్తుతం ఐపీఎల్‌ ఆడుతున్న ఆర్సీబీ జట్టును చూస్తే ఇదే విషయం అర్ధమవుతుంది.  ఆ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కోహ్లి.. వేలంలో కూడా పెద్దగా చొరవచూపలేదంట. ఈ సీజన్‌ ఐపీఎల్‌ కోసం ఆర్సీబీ సరైన వర్కౌట్‌ చేయలేదని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌చోప్రా బహిరంగంగానే విమర్శించాడు. కోహ్లికి తుది జట్టు ఎలా ఉండాలో తెలియదంటూ సెటైర్‌ వేశాడు. ‘ఈసాల కప్‌ నమ్దే’ అంటున్న కోహ్లి.. ఈ జట్టుతో ఎలా నెగ్గుకొస్తాడో అని చోప్రా కాస్త ఘాటుగానే మాట్లాడాడు. ఇవన్నీ చూస్తుంటే వరల్డ్‌కప్‌కు వెళ్లిన సమయంలో కూడా జట్టు గురించి కోహ్లి పెద్దగా కసరత్తు చేయలేదనే తెలుస్తోంది. రాయుడు లేకపోవడమే టీమిండియా వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు వెళ్లకపోవడానికి కారణమని, ఇప్పటికైనా కోహ్లికి జ్ఞానోదయం అయి ఉంటుందని ఫ్యాన్స్‌ విమర్శలు గుప్పిస్తున్నారు. 
(చదవండి: రాయుడో రాయుడా... )

మరిన్ని వార్తలు