పుజారా కౌంటీ ఫామ్‌పై ఆసక్తికర ట్వీట్‌ చేసిన టీమిండియా మాజీ క్రికెటర్‌

9 May, 2022 14:09 IST|Sakshi

ఇంగ్లండ్‌ కౌంటీల్లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు బాది కెరీర్‌ అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్న టీమిండియా నయా వాల్‌ చతేశ్వర్‌ పుజారాపై భారత మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌ ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. టీమిండియాలో చోటు కోల్పోయిన గొప్ప ఆటగాళ్లెప్పుడూ పుజారాలా బ్యాట్‌తోనే సమాధానం చెబుతారని.. సెంచరీలు, డబుల్‌ సెంచరీలతోనే వారు సెలెక్టర్లకు సవాలు విసురుతారని అన్నాడు. ఓ పక్క ఐపీఎల్‌ హంగామా నడుస్తున్నా, పుజారా నేనున్నానని సెలెక్టర్లకు గుర్తు చేశాడని పేర్కొన్నాడు.  


కాగా, పేలవ ఫామ్‌ కారణంగా టీమిండియాలో స్థానం కోల్పోయిన చతేశ్వర్‌ పుజారా ఇంగ్లండ్‌ కౌంటీల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ టీమిండియా సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్‌ 2022లో ససెక్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నయా వాల్‌.. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో నాలుగు శతకాలు (డెర్బీషైర్‌పై 201*, వోర్సెస్టర్‌షైర్‌పై 109, డర్హమ్‌పై 203, మిడిల్‌సెక్స్‌పై 170*) బాదాడు. ఇందులో రెండు డబుల్‌ సెంచరీలు కూడా ఉన్నాయి. 


తాజాగా మిడిల్‌సెక్స్‌తో మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 197 బంతుల్లో 22 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 170 పరుగులు సాధించిన పుజారా తన జట్టును మాత్రం ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. ఈ మ్యాచ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో పుజారా డబుల్‌ సెంచరీతో పాటు మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉన్నప్పటికీ, ససెక్స్‌ 335/4 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి ఫలితం అనుభవించింది. ససెక్స్‌ నిర్ధేశించిన 370 పరుగుల టార్గెట్‌ను మిడిల్‌సెక్స్‌ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. 

మిడిల్‌సెక్స్‌ ఓపెనర్‌ సామ్‌ రాబ్సన్‌ (149) సెంచరీతో కదంతొక్కగా, కెప్టెన్‌ పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌ (79), మ్యాక్స్‌ హోల్డన్‌ (80 నాటౌట్‌) అర్ధ సెంచరీలతో రాణించారు. అంతకముందు ససెక్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో 392 పరుగులకు ఆలౌట్‌ కాగా..  మిడిలెసెక్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో పుజారా.. ప్రత్యర్ధి బౌలర్‌ (మిడిల్‌సెక్స్‌), పాక్‌ ఆటగాడు షాహీన్‌ అఫ్రిది మధ్య బ్యాటిల్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. పుజారా.. షాహిన్‌ అఫ్రిది బౌలింగ్‌లో ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది చుక్కలు చూపించాడు.
చదవండి: IPL 2022: కోహ్లి గోల్డెన్‌ డక్‌.. కోచ్‌ అంటే ఇలా ఉండాలి! వైరల్‌

మరిన్ని వార్తలు