చరిత్ర సృష్టించిన భారత్‌ బాక్సర్‌.. ప్రపంచ నంబర్‌ వన్‌ స్థానం కైవసం

27 Jun, 2021 15:39 IST|Sakshi

న్యూఢిల్లీ: బాక్సింగ్‌ క్రీడలో భారత స్టార్ బాక్సర్​ అమిత్ పంగాల్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసి)కి చెందిన బాక్సింగ్ టాస్క్​ ఫోర్స్ విడుదల చేసిన తాజా ర్యాంక్సింగ్స్​లో పురుషుల 52 కిలోల ఫ్లై వెయిట్ విభాగంలో ప్రపంచ నంబర్‌ వన్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇదే హోదాలో టోక్యో ఒలింపిక్స్​లో బరిలో దిగనున్నాడు. ఈ క్రమంలో అమిత్‌ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు పొందిన ఏకైక భారత ఒలింపియన్‌గా రికార్డు నెలకొల్పాడు. కాగా, గత నెలలో జరిగిన ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్​ ఫైనల్లో​ ఉజ్బెకిస్థాన్​కు చెందిన షాఖోబిదిన్​ జోయిరోవ్​ చేతిలో 2-3 తేడాతో ఓటమిపాలైనప్పటికీ అమిత్‌ ఈ ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. 

ఇదిలా ఉంటే, ఐఓసి తాజా ర్యాంకింగ్స్‌లో అమిత్‌తో పాటు పలువురు భారత బాక్సర్లు టాప్‌ 20లో స్థానం సంపాదించారు. పురుషుల విభాగం​లో సతీష్ కుమార్ (75, 95 కిలోలు)​ తొమ్మిదో స్థానంలో మనీష్ కౌశిక్ (63 కిలోలు) 18వ స్థానంలో నిలిచారు. ఇక మహిళల విభాగంలో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్​గా నిలిచిన భారత స్టార్ బాక్సర్​ మేరీ కోమ్ ​(69 కిలోలు) ఏడో స్థానంలో నిలువగా, సిమ్రాన్​జిత్ కౌర్ (60 కిలోలు) నాలుగో స్థానంలో, లోవ్లినా బోర్గోహైన్(69 కిలోలు) ఐదో స్థానంలో, పూజా రాణి(75 కిలోలు) 8వ స్థానంలో నిలిచారు.

కాగా, కరోనా కారణంగా ఏడాదిపాటు వాయిదా పడ్డ టోక్యో ఒలింపిక్స్ జులై 23న ప్రారంభమై.. ఆగస్టు 8 వరకు జరగనున్నాయి. ఇప్పటికే కొందరు అథ్లెట్లు ఒలింపిక్స్ గ్రామానికి చేరుకున్నారు. ప్రతిరోజు 10000 మంది ప్రేక్షకులను మాత్రమే స్టేడియాలకు అనుమతిస్తామని నిర్వాహకులు ఇటీవలే స్పష్టం చేశారు. మాస్కులు ధరించడం, టెంపరేచర్‌ చెకింగ్‌ వంటి అన్ని కోవిడ్‌ జాగ్రత్తల తీసుకున్న తర్వాతే ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతిస్తామని, అక్కడ కూడా భౌతిక దూరంగా పాటించే విధంగా ఏర్పాట్లు చేశామని, ఆటోగ్రాఫ్‌లు, మద్యపానం తదితరరాలను నిషేధించామని నిర్వహకులు వెల్లడించారు.
చదవండి: టీమిండియా కెప్టెన్‌గా అతనే సరైనోడు: పనేసర్‌

మరిన్ని వార్తలు