నీరజ్‌ చోప్రాకు ఆనంద్‌ మహీంద‍్ర ఇవ్వనున్న గిఫ్ట్‌ ఇదే..

7 Aug, 2021 21:25 IST|Sakshi

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన భారత అథ్లెట్‌ నీరజ్‌ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. జావెలిన్‌ త్రో ఫైనల్లో భాగంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్‌ చోప్రా స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర నీరజ్‌ చోప్రాను బాహుబలి అంటూ ప్రశంసించారు. ఈ క్రమంలో రితేష్‌ జైన్‌ అనే ట్విటర్‌ యూజర్‌ నీరజ్‌ చోప్రాకు మహీంద్ర కంపెనీ త్వరలో లాంచ్‌ చేయనున్న ఎస్‌యూవీ శ్రేణికి చెందిన ఎక్స్‌యూవీ 700 (XUV 700)ని ఇవ్వాలిసిందిగా అభ్యర్థించాడు. 

రితేష్‌ అభ్యర్థనను అంగీకరించిన ఆనంద్‌ మహీంద్ర.. ‘‘తప్పకుండా ఇస్తాను. స్వర్ణం సాధించిన మా అథ్లెట్‌కు ఎక్స్‌యూవీ 700 (XUV 700)బహుమతిగా ఇవ్వడం నాకు వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకం మాత్రమే కాక.. గౌరవం కూడా’’ అంటూ రిప్లై ఇచ్చారు.

అంతేకాక ‘‘మేమంతా మీ ఆర్మీలో భాగమే, బాహుబలి’’ అంటూ నీరజ్‌ చోప్రాను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు ఆనంద్‌ మహీంద్ర. దీంతో పాటు నీరజ్‌ చోప్రా జావెలిన్‌ని విసిరే ఫోటోతో పాటు బాహుబలి చిత్రంలో సైన్యం ముందు బల్లెం పట్టుకుని గుర్రం మీద కూర్చున్న ప్రభాస్‌ ఫోటోని షేర్‌ చేశారు ఆనంద్‌ మహీంద్ర. ప్రస్తుతం ఈ ట్విటర్‌ సంభాషణ తెగ వైరలవుతోంది. 

మరిన్ని వార్తలు