Anand Mahindra: స్టార్లు అవసరం లేదని శ్రీలంక నిరూపించింది..!

12 Sep, 2022 21:44 IST|Sakshi

ఆసియా కప్‌-2022లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి భారత్‌, పాక్‌ లాంటి ప్రపంచ స్థాయి జట్లకు షాకిచ్చి ఏకంగా టైటిల్‌ను ఎగురేసుకుపోయిన శ్రీలంక జట్టుపై వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్ర ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. ఆసియా కప్‌ ఫైనల్లో శ్రీలంక.. పాక్‌ను మట్టికరిపించిన తీరు థ్రిల్లింగ్‌గా అనిపించిందని ట్వీటాడు. క్రికెట్‌ లాంటి టీమ్‌ గేమ్‌లో జట్టు గెలవాలంటే సెలబ్రిటీలు, సూపర్‌ స్టార్లు అవసరం లేదని లంకేయులు మరోసారి నిరూపించారని అన్నాడు. టీమ్‌ వర్క్‌ ఉంటే ఎంత చిన్న జట్టైనా అద్భుతాలు చేయగలదని మరోసారి రుజువైందని తెలిపాడు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. 

కాగా, దుబాయ్‌ వేదికగా నిన్న (సెప్టెంబర్‌ 11) జరిగిన ఆసియా కప్‌ ఫైనల్లో శ్రీలంక.. 23 పరుగుల తేడాతో పాక్‌ను మట్టికరిపించి ఆరో సారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌​ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. 58 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న శ్రీలంకను భానుక రాజపక్ష (45 బంతుల్లో 71 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్సర్లు).. హసరంగ (21 బంతుల్లో 36; 5 ఫోర్లు, సిక్స్‌) సాయంతో ఆదుకున్నాడు. ఛేదనలో పాక్‌ ఓ సమయంలో విజయం దిశగా సాగినప్పటికీ.. లంక బౌలర్లు ప్రమోద్‌ మధుశన్‌ (4/34), హసరంగ (3/27), చమిక కరుణరత్నే (2/33) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. 
 

మరిన్ని వార్తలు