కేరళకు ఆంధ్ర షాక్‌

18 Jan, 2021 06:03 IST|Sakshi

ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో రాయుడు బృందానికి తొలి విజయం

ముంబై: వరుసగా మూడు పరాజయాలు చవిచూశాక... నాకౌట్‌ అవకాశాలు గల్లంతయ్యాక... సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు తేరుకుంది. ఎలైట్‌ గ్రూప్‌ ‘ఇ’లో ‘హ్యాట్రిక్‌’ విజయాలతో జోరుమీదున్న కేరళ జట్టును ఆంధ్ర ఆరు వికెట్ల తేడాతో ఓడించి ఈ టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. టాస్‌ నెగ్గిన ఆంధ్ర ఫీల్డింగ్‌ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేరళ 20 ఓవర్లలో 4 వికెట్లకు 112 పరుగులే చేసింది. ఆంధ్ర స్పిన్నర్లు జి.మనీశ్‌ (2/19), లలిత్‌ మోహన్‌ (1/21), షోయబ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ (1/12) కేరళ జట్టును కట్టడి చేశారు. రాబిన్‌ ఉతప్ప (8), మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ (12), సంజూ సామ్సన్‌ (7), విష్ణు వినోద్‌ (4) తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో కేరళ 38 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

సచిన్‌ బేబీ (34 బంతుల్లో 51 నాటౌట్‌; ఫోర్, 4 సిక్స్‌లు), జలజ్‌ సక్సేనా (34 బంతుల్లో 27 నాటౌట్‌) ఐదో వికెట్‌కు అజేయంగా 74 పరుగులు జోడించడంతో కేరళ స్కోరు 100 పరుగులు దాటింది. 113 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు 17.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రీకర్‌ భరత్‌ (9), మనీశ్‌ (5), రికీ భుయ్‌ (1) వెంటవెంటనే అవుటవ్వడంతో ఆంధ్ర 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. అయితే ఓపెనర్‌ అశ్విన్‌ హెబర్‌ (46 బంతుల్లో 48; 6 ఫోర్లు, సిక్స్‌), కెప్టెన్‌ అంబటి రాయుడు (27 బంతుల్లో 38 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) నాలుగో వికెట్‌కు 48 పరుగులు జత చేసి ఆదుకున్నారు. శ్రీశాంత్‌ బౌలింగ్‌లో అశ్విన్‌ అవుటయ్యాక... ప్రశాంత్‌ కుమార్‌ (9 నాటౌట్‌)తో కలిసి రాయుడు ఆంధ్రను విజయతీరాలకు చేర్చాడు.

మరిన్ని వార్తలు