ఆంధ్ర అదరహో

1 Mar, 2021 01:33 IST|Sakshi
రికీ భుయ్, అశ్విన్, హరిశంకర్‌

విజయ్‌ హజారే ట్రోఫీలో క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత

చివరి లీగ్‌ మ్యాచ్‌లో జార్ఖండ్‌పై ఏడు వికెట్లతో విజయం

గ్రూప్‌ ‘బి’లో అగ్రస్థానం

140 పరుగుల లక్ష్యాన్ని 9.5 ఓవర్లలోనే ఛేదించిన విహారి బృందం

మెరిసిన హరిశంకర్, అశ్విన్, రికీ

ఇండోర్‌: ఇతర సమీకరణాలపై ఆధారపడకుండా ఆంధ్ర క్రికెట్‌ జట్టు దర్జాగా విజయ్‌ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నమెంట్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. జార్ఖండ్‌తో ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘బి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో గాదె హనుమ విహారి నాయకత్వంలోని ఆంధ్ర జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. జార్ఖండ్‌ నిర్దేశించిన 140 పరుగుల విజయలక్ష్యాన్ని ఆంధ్ర జట్టు కేవలం 9.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించడం విశేషం. ఓపెనర్లు అశ్విన్‌ హెబ్బర్‌ (18 బంతుల్లో 44; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), రికీ భుయ్‌ (27 బంతుల్లో 57 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) తొలి బంతి నుంచే జార్ఖండ్‌ బౌలర్ల భరతం పట్టారు. దాంతో 5.5 ఓవర్లలో తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించాక అశ్విన్‌ అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విహారి (2 బంతుల్లో 4; ఫోర్‌), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (5 బంతుల్లో 15; 2 సిక్స్‌లు), నరేన్‌రెడ్డి (7 బంతుల్లో 16 నాటౌట్‌; ఫోర్, 2 సిక్స్‌లు) కూడా ఏమాత్రం దూకుడు తగ్గించకుండా ఆడటంతో ఆంధ్ర లక్ష్యం దిశగా బుల్లెట్‌ వేగంతో దూసుకుపోయింది. జార్ఖండ్‌ జట్టులోని భారత బౌలర్లు వరుణ్‌ ఆరోన్‌ 2 ఓవర్లలో 30 పరుగులు... షాబాజ్‌ నదీమ్‌ 2 ఓవర్లలో 26 పరుగులు సమర్పించుకున్నారు. అంతకుముందు జార్ఖండ్‌ జట్టు 46.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లు హరిశంకర్‌ రెడ్డి (4/30), షోయబ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ (2/30), కార్తీక్‌ రామన్‌ (2/38) జార్ఖండ్‌ పతనాన్ని శాసించారు.

ప్రణాళిక ప్రకారం...
ఈ మ్యాచ్‌కు ముందు ఆంధ్ర ఎనిమిది పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ నేరుగా దక్కాలంటే గ్రూప్‌ ‘టాపర్‌’గా నిలవాలి. ఈ నేపథ్యంలో రన్‌రేట్‌ మెరుగు పర్చుకోవడానికి ఆంధ్ర జట్టు టాస్‌ నెగ్గగానే ఛేజింగ్‌ చేయడానికే మొగ్గు చూపింది. జార్ఖండ్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత ఆఫ్‌ స్పిన్నర్‌ షోయబ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్లో ఓపెనర్‌ ఉత్కర్ష్‌ సింగ్‌ (19; 3 ఫోర్లు)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత జార్ఖండ్‌ 11 పరుగుల తేడాలో మరో మూడు వికెట్లను కోల్పోయింది. దాంతో 54 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి జార్ఖండ్‌ కష్టాల్లో పడింది. కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ (38; 3 ఫోర్లు) నిలదొక్కుకుంటున్న దశలో షోయబ్‌ అతడిని అవుట్‌ చేయడంతో జార్ఖండ్‌ కోలుకోలేకపోయింది.

అనంతరం మీడియం పేసర్లు హరిశంకర్‌ రెడ్డి, కార్తీక్‌ రామన్‌ విజృంభించడంతో జార్ఖండ్‌ ఇన్నింగ్స్‌ 139 పరుగులవద్ద ముగిసింది. లక్ష్యం చిన్నది కావడంతో ఆంధ్ర బ్యాట్స్‌మెన్‌ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగారు. పది ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదించి రన్‌రేట్‌ను మెరుగుపర్చుకున్నారు. ఈ మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఆరు జట్లున్న గ్రూప్‌ ‘బి’లో ఆంధ్ర, తమిళనాడు, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌ జట్లు 12 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్‌ కారణంగా ఆంధ్ర జట్టు (0.73) ‘టాప్‌’ ర్యాంక్‌లో నిలిచింది. తమిళనాడు (0.65), జార్ఖండ్‌ (0.29), మధ్యప్రదేశ్‌ (–0.46) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. గ్రూప్‌ ‘ఎ’ నుంచి గుజరాత్‌... గ్రూప్‌ ‘సి’ నుంచి కర్ణాటక క్వార్టర్‌ ఫైనల్‌ చేరాయి. గ్రూప్‌ ‘డి’ నుంచి ముంబై, ఢిల్లీ... గ్రూప్‌ ‘ఇ’ నుంచి సౌరాష్ట్ర, చండీగఢ్‌ క్వార్టర్‌ ఫైనల్‌ రేసులో ఉన్నాయి.

వెంకటేశ్‌ అయ్యర్‌ 198
పంజాబ్‌తో జరిగిన గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌ 105 పరుగుల తేడాతో గెలిచింది. మధ్యప్రదేశ్‌ ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (146 బంతుల్లో 198; 20 ఫోర్లు, 7 సిక్స్‌లు) రెండు పరుగుల తేడాతో డబుల్‌ సెంచరీని చేజార్చుకున్నాడు. మధ్యప్రదేశ్‌ 50 ఓవర్లలో 3 వికెట్లకు 402 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్‌ 42.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. పంజాబ్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (49 బంతుల్లో 104; 8 ఫోర్లు, 9 సిక్స్‌లు) మెరుపు సెంచరీ చేశాడు.

తన్మయ్, తిలక్‌ వర్మ సెంచరీలు
సూరత్‌: విజయ్‌ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌ జట్టు విజయంతో లీగ్‌ దశను ముగించినా నాకౌట్‌ దశకు అర్హత సాధించలేకపోయింది. గోవా తో జరిగిన ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ రెండు పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా హైదరాబాద్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 345 పరుగులు సాధించింది. ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్‌ (150; 19 ఫోర్లు, సిక్స్‌), తిలక్‌ వర్మ (128, 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 264 పరుగులు జతచేయడం విశేషం. లిస్ట్‌–ఎ క్రికెట్‌లో హైదరాబాద్‌ తరఫున తొలి వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. 2002లో గోవాపై అంబటి రాయుడు, వినయ్‌ కుమార్‌ తొలి వికెట్‌కు 196 పరుగులు జతచేశారు. 346 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గోవా జట్టు 50 ఓవర్లలో 5 వికెట్లకు 343 పరుగులు సాధించి ఓడిపోయింది. ఓపెనర్‌ ఏక్‌నాథ్‌ కేర్కర్‌ (169 నాటౌట్‌; 19 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్నేహల్‌ (112 బంతుల్లో 116; 15 ఫోర్లు) రెండో వికెట్‌కు 225 పరుగులు జోడించారు. ఏక్‌నాథ్‌ చివరిదాకా అజేయంగా ఉన్నా గోవాను గెలిపించలేకపోయాడు. 12 పాయింట్లతో గ్రూప్‌ ‘ఎ’లో హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలిచింది.

‘శత’క్కొట్టిన దేవ్‌దత్, సమర్థ్‌
రైల్వేస్‌తో జరిగిన గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో కర్ణాటక 10 వికెట్ల తేడాతో నెగ్గింది. 285 పరుగుల లక్ష్యాన్ని కర్ణాటక 40.3 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా ఛేదించింది. లిస్ట్‌–ఎ క్రికెట్‌ లో భారత గడ్డపై ఇదే అత్యధిక ఛేదన. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (145 నాటౌట్‌; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు), సమర్థ్‌ (130 నాటౌట్‌; 17 ఫోర్లు) అజేయ శతకాలు సాధించారు. అంతకుముందు ప్రథమ్‌ సింగ్‌ (129; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ చేయడం తో రైల్వేస్‌ 9 వికెట్లకు 284 పరుగులు చేసింది.

ఢిల్లీలో 7 నుంచి నాకౌట్‌ మ్యాచ్‌లు
విజయ్‌ హజారే ట్రోఫీ నాకౌట్‌ మ్యాచ్‌లు ఈనెల 7 నుంచి ఢిల్లీలో జరగనున్నాయి. మొత్తం ఐదు ఎలైట్‌ గ్రూప్‌ల్లో ‘టాప్‌’లో నిలిచిన ఐదు జట్లు... ఆ తర్వాత రెండో స్థానంలో నిలిచిన రెండు అత్యుత్తమ జట్లు క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంటాయి. చివరిదైన ఎనిమిదో బెర్త్‌ కోసం ఓవరాల్‌ ఎలైట్‌ గ్రూప్‌ల్లో ఎనిమిదో స్థానంలో నిలిచిన జట్టు, ప్లేట్‌ గ్రూప్‌ విజేత జట్టుతో 7న ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు చివరి క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ ఖరారవుతుంది. ఈనెల 8, 9 తేదీల్లో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు... 11న సెమీఫైనల్స్‌... 14న ఫైనల్‌ జరుగుతాయి.

>
మరిన్ని వార్తలు