APL 2022 Details: ఏపీఎల్‌ మొదటి సీజన్‌ షురూ

6 Jul, 2022 19:00 IST|Sakshi

విశాఖ స్పోర్ట్స్‌: డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ– వీడీసీఏ స్టేడియం ప్రపంచ క్రికెట్‌ ఆడే అన్ని ఫార్మాట్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది. ఆతిథ్య జట్టుకు అచ్చివచ్చిన స్టేడియంగానూ పేరుగాంచింది. ఇప్పుడు సరికొత్త సీజన్‌ ఇక్క డి నుంచి ప్రారంభమవుతోంది. అదే ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌(ఏపీఎల్‌). దేశవాళీ క్రికెట్‌లో అన్ని తరహా మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వడంతో పాటు అంతర్జాతీయ టెస్ట్‌లు, వన్డేలు, టీ–20లు, ఆఖరికి ఐపీఎల్‌ మ్యాచ్‌లకు హోమ్‌ పిచ్‌గా వైఎస్సార్‌ స్టేడియం సేవలందించింది. ఇప్పటికే ఐపీఎల్‌–15 సీజన్లు పూర్తయినా.. ఆంధ్రా నుంచి ఆడిన వారిని  వేళ్లమీద లెక్కపెట్టవచ్చు.

ఆంధ్రా క్రికెటర్లను ఆ స్థాయిలో ప్రోత్సహించేందుకు ఏపీఎల్‌ సిద్ధమైంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రోత్సాహాంతో.. ఏసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్ర ఆధ్వర్యంలో.. బీసీసీఐ గుర్తింపుతో ఏపీఎల్‌ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఆంధ్రా తరపున ఆడి ప్రతిభ కనబరిచిన మేటి ఆటగాళ్లను వేలం ద్వారా ఆరు ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్నాయి. ఈ నెల 17వ తేదీన టైటిల్‌ పోరు జరగనుండగా.. విజేతకు ట్రోఫీ అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతుండటం విశేషం.  


ఆరంభం ఇలా.. 

ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌(ఏపీఎల్‌) తొలి సీజన్‌ టీ–20 మ్యాచ్‌లు షురూ అయ్యాయి. వైఎస్సార్‌ స్టేడియంలో బుధవారం మధ్యాహ్నపు సెషన్‌ మ్యాచ్‌ ఒంటి గంటకు ప్రారంభమైంది. రెండో మ్యాచ్‌ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆరున్నరకు ప్రారంభమైంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో కోస్టల్‌ రైడర్స్‌తో గోదావరి టైటాన్స్‌ తలపడగా లీగ్‌ చివరి మ్యాచ్‌లో 13న రాయలసీమ కింగ్స్‌తో వైజాగ్‌ వారియర్స్‌ జట్టు తలపడ్డాయి. ఇక ప్లేఆఫ్‌ల్లో లీగ్‌ 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆడనుండగా.. 1, 2వ స్థానాల్లో నిలిచిన జట్లు క్వాలిఫైయర్‌ మ్యాచ్‌ ఆడనున్నాయి.  


ఇవీ ఫ్రాంచైజీలు 

ఉత్తరాంధ్ర నుంచి రెండు ఫ్రాంచైజీలకు అవకాశం ఇవ్వగా.. ఉత్తరాంధ్ర లయన్స్‌ జట్టును కాయల వెంకటరెడ్డి, వైజాగ్‌ వారియర్స్‌ జట్టును సీహెచ్‌ తిరుమలరావు దక్కించుకున్నారు. సెంట్రల్‌ ఆంధ్ర నుంచి బెజవాడ టైగర్స్‌ను పి.వి రమణమూర్తి, గోదావరి టైటాన్స్‌ను పి.హరీష్‌బాబు, దక్షిణాంధ్ర నుంచి కోస్టల్‌ రైడర్స్‌ను ఎం.వెంకటరెడ్డి, రాయలసీమ కింగ్స్‌ను పి.వెంకటేశ్వర్‌ సొంతం చేసుకున్నారు. వీరంతా గత రెండు సీజన్లలో జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఆంధ్రా తరఫున ప్రతిభ కనబరిచిన 20 మంది చొప్పున వేలంలో ఎంపిక చేసుకున్నారు. రంజీల్లో ఆరేళ్లుగా సత్తా చాటుతున్న 12 మందిలో ఇద్దరినీ చొప్పున జట్లకు ఐకాన్‌లుగా తీసుకున్నారు. వారు ఆడిన స్థాయిలను బట్టి ఆయా ఫ్రాంచైజీలు రూ.30 లక్షల వరకు వెచ్చించి ఎంపిక చేసుకున్నాయి.  

దేశంలో లీగ్‌లు 
ఐపీఎల్‌ ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం పొందింది. అదే స్ఫూర్తితో దేశంలోనూ బీసీసీఐ గుర్తించిన కొన్ని లీగ్‌లు జరుగుతున్నాయి. 2009–10 సీజన్‌లోనే కర్నాటక ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభమైంది. ఇదే రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన తొలి ప్రీమియర్‌ లీగ్‌. ప్రైజ్‌ పూల్‌గా రూ.20లక్షలు అందిస్తున్నారు. ఒకటిన్నర కోట్ల ప్రైజ్‌ పూల్‌తో ముంబయి లీగ్‌ 2018లో ప్రారంభించగా, అత్యధిక రూ.2.25కోట్ల ప్రైజ్‌పూల్‌తో తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ 2016 నుంచి కొనసాగుతోంది.  

ఒడిదొడుకుల్లో లీగ్‌లు  
ఒడిశా ప్రీమియర్‌ లీగ్‌ 2011లోనే ప్రారంభమైనా ఒడిదొడుకులతో నాలుగే సార్లు జరిగింది. రూ.6లక్షల ప్రైజ్‌ పూల్‌ ఇస్తోంది. సౌరాష్ట్ర ప్రీమియర్‌ లీగ్‌ 2019లో నిర్వహించగా... కేరళ ప్రెసిడెంట్స్‌ కప్‌ 2020లో నిర్వహించారు. మహారాష్ట్ర ప్రీమియర్‌ లీగ్‌ 2009లో, తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌ 2018లో జరిగాయి. ఇక రాజపుటానా ప్రీమియర్‌ లీగ్, రాజ్‌వాడ క్రికెట్‌ లీగ్‌లు తొలి సెషన్స్‌లోనే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కారణాలతో సస్పెండ్‌ చేశారు. దీంతో తొలిసారిగా నిర్వహిస్తున్న ఏపీఎల్‌ను విజయవంతం చేసేందుకు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) కృషి చేస్తోంది. 


గోదావరి టైటాన్స్‌

గోదావరి టైటాన్స్‌ రూ.6.1 లక్షలతో ఆల్‌రౌండర్‌ శశికాంత్‌తో పాటు బ్యాటర్‌ నితీష్‌ కుమార్‌ను రూ.5 లక్షలతో కొనుగోలు చేసి బ్యాటింగ్‌లో దూకుడు చూపేందుకు సిద్ధమైంది. అనుభవజ్ఞుడు వటేకర్‌ కోచ్‌గా ఉండగా సందీప్, ధీరజ్, ఇస్మాయిల్, సాత్విక్, ఎం. వంశీకృష్ణ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆడారు.


ఉత్తరాంధ్ర లయన్స్‌  

ఉత్తరాంధ్ర లయన్స్‌ జట్టు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ శ్రీకర్‌ భరత్‌ను రూ.6 లక్షలకు కొనుగోలు చేసింది. ఇక ఆల్‌రౌండర్‌ షోయిబ్‌ను రూ.2లక్షలతోనే ఐకాన్‌గా ఎంచుకుంది. జట్టు విజయసారథి శిక్షణలో అహితేష్, క్రాంతి, తరుణ్, సుబ్రహ్మణ్యం, ప్రమో, రఫీ, సాయికౌషిక్, అజయ్‌ తదితరులతో ముందుకు నడవనుంది. 


బెజవాడ టైగర్స్‌  

బెజవాడ టైగర్స్‌ జట్టు రూ.8.1 లక్షలతో బ్యాటర్‌ రికీబుయ్‌ను తీసుకున్నా.. బౌలింగ్‌లో మెరుపులు మెరిపించేందుకు అయ్యప్పను కేవలం రూ.లక్షన్నరకే దక్కించుకుంది. వి.అప్పారావు కోచింగ్‌లో సాయిరాహుల్, మహీష్, లలిత్, అఖిల్, మనీష్, సుమంత్, సాయితేజ తదితరులు ఆడనున్నారు. 


వైజాగ్‌ వారియర్స్‌ 

వైజాగ్‌ వారియర్స్‌ జట్టు బ్యాటర్‌ అశ్విన్‌ హెబ్బర్‌ను అత్యధికంగా రూ.8.7 లక్షలతో కొనుగోలు చేసింది. మరో ఐకాన్‌ ఆల్‌రౌండర్‌ నరేంద్ర రెడ్డిని రూ.4లక్షలకు చేజిక్కించుకుంది. విన్సెంట్‌ కోచింగ్‌లో ధ్రువ్, కార్తీక్, వేణు, మనోహర్, కరణ్, గిరినాథ్, సుదర్శన్, మల్లికార్జున తదితరులు జట్టుకు ఆడనున్నారు. 


కోస్టల్‌ రైడర్స్‌ 

కోస్టల్‌ రైడర్స్‌ ఫాస్ట్‌ బౌలర్‌ స్టీఫెన్‌ను రూ.4.50 లక్షలకు కొనుగోలు చేయగా మరో ఐకాన్‌ బౌలర్‌ హరిశంకర్‌పైనే దృష్టి పెట్టి 1.6 లక్షలకు కొనుగోలు చేసింది. విజయ్‌కుమార్‌ కోచ్‌గా లేఖజ్, తపస్వి, జ్ఞానేశ్వర్, అషిష్, హర్షవర్ధన్, మనీష్, రవికిరణ్, విజయ్‌ తదితరులు జట్టుకు ఆడనున్నారు. 


రాయలసీమ కింగ్స్‌  

రాయలసీమ కింగ్స్‌ రూ.6.1 లక్షలతో ఆల్‌రౌండర్‌ గిరినాథ్‌ను, ఇటీవల జూనియర్స్‌లో సత్తాచాటిన రషీద్‌ను రూ.3.5 లక్షలతో కొనుగోలు చేసి బ్యాటింగ్‌లో బలం సొంతం చేసుకుంది. శ్రీనివాస్‌ కోచ్‌గా దుర్గాకుమార్, ప్రశాంత్, వంశీకృష్ణ, సంతోష్, అభిషేక్‌ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగే తొలి మ్యాచ్‌లో ఆడారు. (క్లిక్‌: విశాఖ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్‌!)

మరిన్ని వార్తలు