Andre Russell: 'బలిపశువులా బస్సు కిందకు తోయాలనుకుంటున్నారు!'

17 Aug, 2022 19:54 IST|Sakshi

వెస్టిండీస్‌ సీనియర్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌, విండీస్‌ క్రికెట్‌ హెడ్‌కోచ్‌ ఫిల్‌ సిమ్మన్స్‌ మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొంతమంది విండీస్‌ క్రికెటర్లు డబ్బుపై మోజుతో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం కంటే ప్రైవేట్‌ లీగ్‌ల్లోనే ఎక్కువగా ఆడుతున్నారంటూ ఫిల్‌ సిమ్మన్స్‌ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశాడు. ''ఇలా జరుగుతుందని ముందే ఊహించాను.. కానీ ఇప్పుడు సైలెంట్‌గా ఉండడమే బెటర్‌'' అని సిమ్మన్స్‌ వ్యాఖ్యలపై ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా రసెల్‌ ధీటుగా కౌంటర్‌ ఇచ్చాడు. ఆ తర్వాత రసెల్‌ ఆ పోస్టును డిలీట్‌ చేశాడు.

తాజాగా తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నట్లు రసెల్‌ మరోసారి కుండబద్దలు కొట్టాడు. ప్రస్తుతం ది హండ్రెడ్‌ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న రసెల్‌ను.. బుధవారం విండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ డారెన్‌ సామీ ఇంటర్య్వూ చేశాడు. ఈ సందర్భంగా రసెల్‌ మాట్లాడుతూ.. '' ఈ విషయంలో నిశబ్దంగా ఉండాలని అనుకుంటున్నా. ఇంతకముందు జరిగిన చర్చల్లో ఈ విషయంపై చాలా స్పష్టంగా మాట్లాడుకున్నాం. అందుకే నన్ను చెడ్డవాడిగా సృష్టించి.. బలిపశువులా బస్సు కిందకు తోసేయాలని కొంతమంది కంకణం కట్టుకున్నారు. అందుకే నన్ను రెచ్చగొట్టేలా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడో ఊహించాను కాబట్టే సైలెంట్‌గా ఉండదలచుకున్నా.

అయితే విండీస్‌ జట్టు నుంచి దూరమవ్వాలని నేనెప్పుడు భావించలేదు. ఏ క్రికెటర్‌ అయినా సొంత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కోరకుంటాడు. నాకు అవకాశం వచ్చినప్పుడు నేనేంటో నిరూపించుకున్నా. ఇప్పటికిప్పుడు విండీస్‌ జట్టుతో ఆడి రెండు ప్రపంచకప్‌లు గెలవాలని ఉంది. కానీ ఆ అవకాశం వస్తుందా అంటే చెప్పలేను. నిజాయితీగా చెప్పాలంటే.. ప్రైవేట్‌ లీగ్స్‌లో ఆడేటప్పుడే రెండు సెంచరీలు సాధించాను. కానీ అవి విండీస్‌ జట్టుకు చేస్తే బాగుండు అని చాలాసార్లు అనిపించింది.

ఒకవేళ ఆ రెండు సెంచరీలు విండీస్‌ తరపున చేసి ఉంటే జట్టులో ప్రత్యేక స్థానం ఉండేది. అయితే కొన్ని షరతులు అంగీకరించలేకుండా ఉన్నాయి. అందుకే ప్రైవేట్‌ లీగ్స్‌ ఆడాల్సి వస్తోంది.  ఇప్పుడు నా వయసు 34 సంవత్సరాలు. మహా అయితే మరో నాలుగేళ్లు క్రికెట్‌ ఆడుతానేమో. మాకు కుటుంబాలు ఉన్నాయి. వారి బాగోగులు చూసుకోవడానికి కెరీర్‌లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అవకాశం వస్తే ఇప్పటికి విండీస్‌కు ప్రపంచకప్‌ అందించాలని భావిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. 

2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఆండ్రీ రసెల్‌ వెస్టిండీస్‌ తరపున 56 టి20ల్లో 1034 పరుగులు, 70 వికెట్లు.. 67 టి20ల్లో 741 పరుగులు, 39 వికెట్లు తీశాడు. ఇక తన చివరి వన్డేను విండీస్‌ తరపున 2019లో ఆడాడు. రసెల్‌ ఆఖరిసారిగా వెస్టిండీస్‌ తరపున టి20 ప్రపంచకప్‌ 2021లో పాల్గొన్నాడు. అయితే యూఏఈ వేదికగా జరిగిన ఆ ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ దారుణ ప్రదర్శన కనబరిచింది.

చదవండి: 'ఆడమని ఎవరిని అడుక్కోం'.. విండీస్‌ కోచ్‌; రసెల్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Jonny Bairstow: కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. మరోసారి నిరూపితం

>
మరిన్ని వార్తలు