Andrew Symonds: ఆండ్రూ సైమండ్స్‌ గొప్ప ఆల్‌రౌండర్‌.. కానీ ఆ వివాదాల వల్లే..

15 May, 2022 10:17 IST|Sakshi

క్రికెట్ ఫ్యాన్స్‌కి బిగ్ షాక్ తగిలింది. ఆసిస్ లెజెండరీ క్రికెటర్, ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. శనివారం రాత్రి టౌన్స్‌విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. సైమండ్స్ ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టులో కీలక ఆటగాడు మాత్రమే కాకుండా అత్యంత నైపుణ్యం కలిగిన ఆల్‌రౌండర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే సైమండ్స్‌ తన ఆటతో పాటు పలు కాంట్రవర్శీలతో కూడా వార్తల్లో నిలిచాడు. ఇవి అతని క్రికెట్‌ కెరీర్‌ని కాస్త మసకబారేలా చేశాయి. అందులో ముఖ్యమైంది మంకీ గేట్ వివాదం.

వివాదాలతో వార్తల్లో..
సైమండ్స్‌ క్రికెట్ చరిత్రలో ‘మంకీగేట్’ వివాదం ఓ కుదుపు కుదిపేసింది. అప్పుడు ఏం జరిగిందంటే.. 2008లో సిడ్నీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో హర్భజన్ సింగ్ తనను ‘మంకీ’ అన్నాడని ఆండ్రూ సైమండ్స్‌ ఆరోపించాడు. అయితే హర్భజన్‌ మాత్రం తాను అలా అనలేదని చెప్పాడు. హర్భజన్ సింగ్‌కి అవతలివైపు నాన్‌స్టైయికింగ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సచిన్ టెండూల్కర్, ఈ విషయంలో హర్భజన్‌కు మద్దతుగా నిలిచాడు. భజ్జీ మంకీ అనలేదని, హిందీలో ఒక అసభ్య పదం ప్రయోగించాడని చెప్పాడు. ఆ పదం తాను స్వయంగా విన్నానని స్పష్టం చేశాడు. ఈ విషయం మీద దాదాపు కొన్ని రోజుల పాటు వివాదం, విచారణ సాగింది. చివరకు భజ్జీపై ఒక టెస్టు మ్యాచ్‌ నిషేదం, జరిమానా విధించారు.

మైఖెల్‌ క్లార్క్ వైస్-కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2008లో డార్విన్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్ నుంచి సైమండ్స్‌ ప్రవర్తన సరిగా లేదని ఇంటికి పంపింది క్రికెట్‌ ఆస్ట్రేలియా. ఎందుకంటే సైమండ్స్ యాజమాన్యం నిర్వహించే సమావేశాలు హాజరవడం కంటే చేపల వేటకు వెళ్లేందుకు ఇష్టపడేవాడు. 

2005లో కార్డిఫ్‌లో బంగ్లాదేశ్‌తో ట్రై-సిరీస్ మ్యాచ్‌కు ముందు సైమండ్స్ ఆస్ట్రేలియన్ జట్టు నుంచి తొలగించారు. మ్యాచ్‌కు మునుపటి సాయంత్రం మద్యం సేవించడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.

జూన్ 2009లో, ఆండ్రూ సైమండ్స్ ఆస్ట్రేలియన్ జట్టులో ఉన్నప్పుడు మూడవసారి క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగా ట్వంటీ20 ప్రపంచ కప్ నుంచి తొలగించారు.

సైమండ్స్‌ స్వభావం తన క్రికెట్ కెరీర్‌ను దెబ్బ తీసిందనే చెప్పాలి. సైమండ్స్ తన కెరీర్‌లో అనేక వివాదాలను ఎదుర్కొన్నప్పటికీ, అతను ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో గొప్ప ఆల్ రౌండర్లలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

చదవండి: Andrew Symonds: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు షాక్‌.. ఆసిస్‌ మాజీ క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్‌ మృతి

>
మరిన్ని వార్తలు