Andrew Symonds: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు షాక్‌.. ఆసిస్‌ మాజీ క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్‌ మృతి

15 May, 2022 09:33 IST|Sakshi

ఆస్ట్రేలియా క్రికెట్ ప్రేమికులకు బిగ్ షాక్ తగిలింది. ఆసీస్ లెజెండరీ క్రికెటర్, మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. శనివారం రాత్రి టౌన్స్‌విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే స్పిన్‌ దిగ్గజం షేన్ వార్న్ అకాల మృతి చెందగా.. ఇప్పుడు సైమండ్స్‌ మృతితో యావత్‌ క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది.

తన ఆటతో అనతి కాలంలోనే ఆస్ట్రేలియా టీమ్‌లో స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా సైమండ్స్‌ పేరు తెచ్చుకున్నారు. కెరీర్‌లో 198 వన్డేలు ఆడిన సైమండ్స్‌.. ఆస్ట్రేలియా 2003, 2007 ప్రపంచ కప్‌ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. సైమండ్స్ అకాల మృతి పట్ల ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు, ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు అడమ్‌ గ్రిల్‌కిస్ట్‌, భారత మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, పాక్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ సంతాపం తెలుపుతూ టీట్లు చేశారు.

సైమండ్స్‌ కెరీర్‌.. 1998లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అనతి కాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా పేరు సంపాదించుకున్నాడు. మొత్తం 198 వన్డేల్లో 5088 పరుగులు చేసిన సైమండ్స్‌.. అందులో ఆరు సెంచరీలు, 30 అర్థ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ఆల్‌రౌండర్‌.. 133 వికెట్లు పడగొట్టాడు. జట్టు విజయంలో చాలా సార్లు కీలక పాత్ర పోషించాడు.

2004లో శ్రీలంకపై టెస్ట్ కెరీర్ ప్రారంభించిన సైమండ్స్‌.. మొత్తం 26 మ్యాచ్‌ల్లో 1463 పరుగులు చేయగా.. వాటిలో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 పరంగా  14 మ్యాచ్‌ల్లో.. రెండు హాఫ్ సెంచరీలతో 337 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. తొలి సీజన్‌లో సైమండ్స్‌ను డెక్కన్ ఛార్జర్స్ రూ.5.4 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం విశేషం.  2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు సైమండ్స్‌ వీడ్కోలు పలికాడు.

చదవండి: IPL 2022: రివ్యూకు సిగ్నల్ చేయడం మర్చిపోయాడు.. పాపం రింకూ సింగ్‌..!

మరిన్ని వార్తలు