Team India: 3 ఫార్మాట్లకు 3 వేర్వేరు జట్లు, కెప్టెన్లు, కోచ్‌లు..!

15 Nov, 2022 10:00 IST|Sakshi

Anil Kumble: టీ20 వరల్డ్‌కప్‌-2022 సెమీఫైనల్లో టీమిండియా ఓటమి అనంతరం భారత మాజీ కెప్టెన్‌, కోచ్‌ అనిల్‌ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో టీమిండియా సక్సెస్‌ సాధించేందుకు తోడ్పడే కీలక ప్రతిపాదనతో ముందుకొచ్చాడు. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా ఫాలో అవుతున్న.. '3 ఫార్మాట్లకు 3 వేర్వేరు జట్లు' అనే ఫార్ములాను టీమిండియా కూడా ఫాలో అవ్వాలని సూచించాడు. 2021లో ఆసీస్‌.. తాజాగా ముగిసిన వరల్డ్‌కప్‌ (2022)లో ఇంగ్లండ్‌ సక్సెస్‌ మంత్ర ఇదేనని పేర్కొన్నాడు.

టెస్ట్‌ల్లో , పరిమిత​ ఓవర్ల క్రికెట్‌లో వేర్వేరు కోచ్‌లు, వేర్వేరు కెప్టెన్లతో ఇంగ్లండ్‌ జట్టు అద్భుత ఫలితాలు సాధిస్తున్న నేపథ్యంలో జరుగుతున్న చర్చపై కుంబ్లే తన అభిప్రాయాన్ని ఈమేరకు వెల్లడించాడు. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు, ముగ్గురు కోచ్‌లు ఉండాలని కచ్చితంగా చెప్పలేను కానీ, జట్టు మాత్రం డిఫరెంట్‌గా (ఆయా ఫార్మాట్లలో స్పెషలిస్ట్‌లతో కూడిన జట్టు) ఉంటే తప్పక సత్ఫలితాలు వస్తాయని కాన్ఫిడెంట్‌గా చెప్పాడు.  

ముఖ్యంగా టీ20లకు ప్రత్యేక జట్టు చాలా అవసరమని, ఈ ఫార్మాట్‌లో హార్డ్‌ హిట్టర్లు, ఆల్‌రౌండర్లు, టీ20 స్పెషలిస్ట్‌ల పాత్ర చాలా కీలకమని, 2021 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా, తాజాగా ముగిసిన వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ ఈ ఫార్ములా అమలు చేసే విజయాలు సాధించాయని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌ జట్టులో లివింగ్‌స్టోన్‌, ఆసీస్‌ టీమ్‌లో స్టొయినిస్‌ లాంటి ఆటగాళ్లు 6, 7 స్థానాల్లో బ్యాటింగ్‌ చేస్తున్నారంటే, ఆయా జట్ల కూర్పు ఎలా ఉందో  ఇట్టే అర్ధమవుతుందని ఉదహరించాడు.

కుంబ్లే చేసిన ఈ ప్రతిపాదనకు ఆసీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ టామ్‌ మూడీ కూడా మద్దతు పలికాడు. అన్ని జట్లు ఈ విషయం గురిం‍చి సీరియస్‌గా ఆలోచించాలని సూచిం‍చాడు. కాగా, విశ్వవిజేత ఇంగ్లండ్‌ జట్టుకు టెస్ట్‌ల్లో, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో వేర్వేరు కోచ్‌లు, కెప్టెన్లు, జట్లు ఉన్న విషయం తెలిసిందే. ఆ జట్టుకు టెస్ట్‌ల్లో బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ కోచ్‌గా, బెన్‌ స్టోక్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మాథ్యూ మాట్‌ కోచ్‌గా, జోస్‌ బట్లర్‌ కెప్టెన్‌గా ఉన్నాడు.

టీ20ల్లో మాజీ ఛాంపియన్‌ అయిన ఆసీస్‌కు టెస్ట్‌ల్లో, లిమిటెడ్‌ ఓవర్స్‌ ఫార్మాట్‌లో వేర్వేరు కోచ్‌లు లేనప్పటికీ.. కెప్టెన్లు (కమిన్స్‌, ఫించ్‌), జట్టు పూర్తిగా వేరుగా ఉంది. టీమిండియా విషయానికొస్తే.. మన జట్టు మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్‌ (రోహిత్‌ శర్మ), ఒకే కోచ్‌ (ద్రవిడ్‌), ఇంచుమించు ఒకే జట్టు కలిగి ఉంది. అప్పుడప్పుడు అంతగా ప్రాధాన్యత లేని సిరీస్‌లకు రెస్ట్‌ పేరుతో కెప్టెన్‌కు, కోచ్‌కు రెస్ట్‌ ఇస్తుంది. ఆ సమయంలో కోచ్‌గా ఎన్‌సీఏ డైరెక్టర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ కోచ్‌గా వ్యవహరిస్తుంటాడు. కెప్టెన్ల మాట చెప్పనక్కర్లేదు. రోహిత్‌ గైర్హాజరీలో ఒక్కో సిరీస్‌కు ఒక్కో ఆటగాడు కెప్టెన్‌గా పని చేశాడు. గత ఏడాది కాలంలో భారత్‌ ఏకంగా ఏడుగురు కెప్టెన్లను మార్చింది.   
చదవండి: ఐపీఎల్‌ 2023కు ముగ్గురు ఆసీస్‌ స్టార్లు డుమ్మా.. దేశ విధులే ముఖ్యమంటూ..!

మరిన్ని వార్తలు