అది చాలా పెద్ద తప్పు.. అంబటి రాయుడికి అన్యాయం చేశారు: కుంబ్లే

31 May, 2023 16:49 IST|Sakshi

భారత మాజీ క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ ఆటగాడు అంబటి రాయుడు ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌-2023 ఫైనల్‌ అనంతరం తన ఐపీఎల్‌ కెరీర్‌కు రాయుడు ముగింపు పలికాడు. కాగా ఐపీఎల్‌లో రాయుడు ఆరు టైటిల్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు టైటిల్స్‌ ముంబై ఇండియన్స్‌ తరపున సాధించగా.. మరో మూడు టైటిల్స్‌ సీఎస్‌కే తరపున గెలుచుకున్నాడు.

ఇక ఐపీఎల్‌ విషయాన్ని పక్కన పెడితే.. రాయుడి వంటి అద్భుతమైన టాలెంట్‌ ఉన్న ఆటగాడికి బీసీసీఐ మాత్రం అన్యాయం ​చేసిందనే చెప్పుకోవాలి. భారత్ తరపున రాయుడు కేవలం 55 వన్డేలు, ఆరు టీ20లు మాత్రమే ఆడాడు. 2018-19 మధ్య కాలంలో భారత జట్టులో నాలుగో స్థానంలో సరైన ఆటగాడు లేని లోటు సృష్టంగా కన్పించింది.

ఈ సమయంలో రాయుడు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుతంగా రాణించాడు. దీంతో భారత జట్టు కష్టాలు తీరి పోయాయి అని, నాలుగో స్ధానానికి సరైన ఆటగాడు దొరికాడని అంతా భావించారు. ఇదే సమయంలో 2019 వన్డే ప్రపంచకప్‌లో రాయుడు అడుతాడని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్‌ చోటుచేసుకుంది.

2019 వన్డే ప్రపంచకప్‌కు రాయుడును కాదని ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. ఈ క్రమంలో తనను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర నిరాశ చెందిన రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు. అయితే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ భారత్‌ తరపున ఆడే అవకాశం రాలేదు. ఇక ఇదే విషయంపై తాజాగా టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే స్పందించాడు.

"రాయుడు 2019 ప్రపంచకప్‌ ఆడాల్సింది. అందులో ఎలాంటి సందేహం లేదు. అది సెలక్షన్‌ కమిటీతో పాటు జట్టు మేనెజ్‌మెంట్‌ చేసిన పెద్ద తప్పు. అతడిని నాలుగో స్థానం కోసం  సిద్ధం చేశారు. అటువంటిది ఆ తర్వాత జట్టులో స్థానం లేకుండా చేశారు. అది చాలా ఆశ్చర్యం కలిగించింది" అని ఐపీఎల్ ఫైనల్ తర్వాత జియో సినిమాలో మాట్లాడుతూ కుంబ్లే పేర్కొన్నాడు. కాగా ఆ సమయంలో భారత జట్టు కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి, హెడ్‌ కోచ్‌గా రవిశాస్త్రి ఉన్నారు.
చదవండి: WTCFinal2023: ఇంగ్లండ్‌ గడ్డపై అడుగుపెట్టిన ఆ ఐదుగురు! ఫోటోలు వైరల్‌

మరిన్ని వార్తలు