WAC 2022: జావెలిన్‌ త్రో ఫైనల్లో భారత అథ్లెట్‌

21 Jul, 2022 15:56 IST|Sakshi

అమెరికాలోని ఒరేగాన్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా అథ్లెట్‌ అన్నూ రాణి శుభారంభం చేసింది. గురువారం ఉదయం జరిగిన జావెలిన్‌ త్రో క్వాలిఫయింగ్‌ పోటీల్లో అన్నూ రాణి రెండో ప్రయత్నంలో ఈటెను 59.06 మీటర్ల దూరం విసిరి గ్రూఫ్‌ బిలో 5వ స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా ఎనిమిదో స్థానంలో నిలిచిన అన్నూ రాణి ఫైనల్లో అడుగుపెట్టింది.

వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండోసారి జావెలిన్‌ త్రో ఫైనల్లో అడుగుపెట్టిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా నిలిచింది. 2019లో దోహా వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లో అన్నూ రాణి ఎనిమిదో స్థానానికే పరిమితమైంది. మరి ఈసారైనా పతకం సాధిస్తుందేమో చూడాలి. అంతకముందు ఈటెను తొలి ప్రయత్నంలో 55.32 మీటర్లు విసిరినప్పటికి.. రెండో ప్రయత్నంలో మాత్రం 59.60 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక 29 ఏళ్ల అన్నూ రాణి కెరీర్‌ బెస్ట్‌ 63.82 మీటర్లుగా ఉంది. జంషెడ్‌పూర్‌ వేదికగా ఈ ఏడాది మేలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో అన్నూ రాణి ఈ ప్రదర్శనను నమోదు చేసింది. 

ఇక జపాన్‌కు చెందిన హరుకాకిటాగుచి ఈటెను 64.32 మీటర్ల దూరం విసిరి సీజన్‌ బెస్ట్‌తో తొలి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో చైనాకు చెందిన షియింగ్‌ లిహూ(63.86 మీటర్లు), లిథువేనియాకు చెందిన లివేట జాసియునైట్(63.80 మీటర్లు) మూడో స్థానంలో నిలిచింది. మొత్తంగా గ్రూఫ్‌ ఏ, గ్రూఫ్‌ బి నుంచి కలిపి 12 మంది ఫైనల్లో పోటీ పడనున్నారు. మహిళల జావెలిన్‌ త్రో ఫైనల్‌ జూలై 22న ఉదయం 5 గంటలకు జరగనుంది.

చదవండి: World Athletics Championship: 'నా కొడుకు ప్రపంచ చాంపియన్‌.. గర్వంగా ఉంది'

మరిన్ని వార్తలు