సంప్రాస్‌ను దాటిన జొకోవిచ్‌

23 Sep, 2020 02:49 IST|Sakshi

అత్యధిక వారాలు నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచన రెండో ప్లేయర్‌గా సెర్బియా స్టార్‌ ఘనత 

రోమ్‌: ఈ ఏడాది ఓటమి లేకుండా తన జైత్రయాత్ర కొనసాగిస్తున్న సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ తన కెరీర్‌లో మరో మైలురాయి అందుకున్నాడు. సోమవారం ఇటాలియన్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీలో విజేతగా నిలిచిన జొకోవిచ్‌ అత్యధిక మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్స్‌ నెగ్గిన ప్లేయర్‌గా కొత్త చరిత్ర లిఖించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ నంబర్‌వన్‌ ర్యాంకర్‌ మరో ఘనత వహించాడు. అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌ ప్రవేశపెట్టిన తర్వాత అత్యధిక వారాలపాటు టాప్‌ ర్యాంక్‌లో నిలిచిన రెండో ప్లేయర్‌గా జొకోవిచ్‌ గుర్తింపు పొందాడు. మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్‌ టాప్‌ ర్యాంక్‌లో నిలువడంతో అతను ఈ స్థానంలో 287 వారాలు ఉన్నట్టయింది. దాంతో 286 వారాలతో ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న అమెరికా దిగ్గజం పీట్‌ సంప్రాస్‌ మూడో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో 310 వారాలతో స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ తొలి స్థానంలో ఉన్నాడు. మహిళల సింగిల్స్‌ విభాగంలో ‘టాప్‌ ర్యాంక్‌’ ఘనత స్టెఫీ గ్రాఫ్‌ (జర్మనీ–377 వారాలు) పేరిట ఉంది.

మరిన్ని వార్తలు