Mohammed Shami: షమీపై దారుణమైన ట్రోల్స్‌.. అతడు చేసిన తప్పేంటి? ప్రశ్నించిన కేంద్ర మంత్రి

8 Oct, 2022 12:15 IST|Sakshi

Mohammed Shami-  Dussehra- T20 World Cup 2022: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత సెలబ్రిటీలు అభిమానులకు మరింత చేరువయ్యే అవకాశం దొరికింది. తమకు సంబంధించిన ప్రతీ అప్‌డేట్‌ను పంచుకోవడంతో పాటు.. పండుగ సమయాల్లో విష్‌ చేయడం పరిపాటిగా మారింది. అయితే, ఒక్కోసారి ఇలాంటి సమయాల్లో పోస్టులు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నా.. హేటర్స్‌ నుంచి మాత్రం అదే స్థాయిలో ట్రోలింగ్‌ ఎదుర్కోవాల్సి వస్తుంది.

దసరా శుభాకాంక్షలు.. షమీపై ట్రోల్స్‌
టీమిండియా సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీకి ఇటీవల ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. విజయదశమి సందర్భంగా.. ‘‘దసరా శుభ సందర్భంగా... రాముడు మీకు సకల సంతోషాలు ప్రసాదించాలని, విజయాలనివ్వాలని కోరుకుంటున్నా. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు’’ అని షమీ ట్వీట్‌ చేశాడు.

ఇందుకు స్పందించిన నెటిజన్లు కొంతమంది.. ‘‘ధన్యవాదాలు షమీ భాయ్‌! మీకు కూడా పండుగ శుభాకాంక్షలు’’ అని సంతోషం వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం అతడిని దారుణంగా ట్రోల్‌ చేస్తూ విద్వేషపు కామెంట్లు చేశారు. ఈ విషయంపై తాజాగా స్పందించిన కేంద్ర క్రీడా శాఖా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. షమీకి అండగా నిలబడ్డారు.

షమీ చేసిన తప్పేంటి?
‘‘దసరా అనేది దేశవ్యాప్తంగా అందరూ కలిసి చేసుకునే పండుగ. భారత క్రికెటర్లు కూడా అంతా కలిసి పండుగ జరుపుకొంటారు. మహ్మద్‌ షమీ ఈ పండుగను సెలబ్రేట్‌ చేసుకుంటే తప్పేంటి? అతడిని తప్పుబడుతున్న వారికి అందరూ కలిసి ఉండటం ఇష్టం లేనట్లే అనిపిస్తోంది. ఏదేమైనా దేశమంతా అన్ని పండుగలు కలిసి జరుపుకోవాలి. అంతా కలిసి ఉండాలి’’ అని అనురాగ్‌ ఠాకూర్‌ పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో స్వదేశంలో సిరీస్‌కు షమీ ఎంపికైనా కరోనా బారిన పడిన కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇక ప్రపంచకప్‌-2022 టోర్నీ నేపథ్యంలో స్టాండ్‌బై అతడికి అవకాశం దక్కింది. అయితే, ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరం కావడంతో షమీ అతడి స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది.

చదవండి: Ind Vs SA: పరుగులు సాధిస్తున్నా టీమిండియాలో చోటు దక్కడం లేదు! స్వీట్లు, చైనీస్‌ ఫుడ్‌ మానేశా! ఇకపై..

మరిన్ని వార్తలు