స్టార్‌ మహిళా క్రికెటర్‌ బయోపిక్‌లో అనుష్క శర్మ..?

6 Jul, 2021 19:53 IST|Sakshi

ముంబై: భారత చలన చిత్ర రంగంలో ఇటీవలి కాలంలో బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రముఖ క్రీడాకారుల జీవిత చరిత్రలపై వరుసపెట్టి సినిమాలు తెరకెక్కుతున్నాయి. కొంతకాలం క్రితం టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎంఎస్ ధోనీ.. ది అన్‌టోల్డ్ స్టోరీ’ తెరకెక్కగా, తాజాగా టీమిండియా మహిళా జట్టు పేసర్ ఝులన్ గోస్వామి బయోపిక్ అభిమానుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఝులన్ గోస్వామి పాత్రలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్‌ స్టార్‌ నటి అనుష్క శర్మ నటించనున్నట్లు బీటౌన్‌ వర్గాల సమాచారం. 

కాగా, గతేడాది జనవరిలో అనుష్కశర్మ టీమిండియా జెర్సీలో కనిపించినప్పటి నుంచి ఝులన్‌ గోస్వామి బయోపిక్‌ అంశంపై వార్తలు గుప్పుమంటున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఝులన్‌తో కలిసి అనుష్క కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ హంగామా అనే మ్యాగజీన్‌ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అంశాన్ని ప్రచురించింది. ఈ ఏడాది చివరినాటికి ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కే అవకాశం ఉందని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌ నడుస్తుందని పేర్కొంది.    

పశ్చిమ బెంగాల్‌కు చెందిన 38 ఏళ్ల ఝులన్ గోస్వామి.. 2002లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. ఆమె భారత్‌ తరఫున మూడు ఫార్మాట్లలో 330కి పైగా వికెట్లు పడగొట్టింది. మహిళల క్రికెట్‌లో ఆమె దాదాపు రెండు దశాబ్దాలుగా రాణిస్తుంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న భారత మహిళల జట్టులో గోస్వామి సభ్యురాలిగా ఉంది. త్వరలోనే భారత్, ఇంగ్లండ్ మహిళల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు దేశాల మధ్య జరిగిన ఏకైక టెస్టు డ్రా కాగా, మూడు వన్డేల సిరీస్‌ను 1-2తో భారత్ చేజార్చుకుంది. ఈ నెల 9 నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు