KS Bharat: కేఎస్‌ భరత్‌ అరంగేట్రం.. సీఎం జగన్‌ శుభాకాంక్షలు

9 Feb, 2023 11:27 IST|Sakshi

CM YS Jagan Tweet On KS Bharat Debut: భారత క్రికెట్‌ జట్టులో కోన శ్రీకర్‌ భరత్‌ అరంగేట్రం పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా భరత్‌ ఫొటో షేర్‌ చేస్తూ అభినందనలు తెలియజేశారు.

తెలుగు జాతి గర్వపడేలా మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కాగా ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్‌లో గురువారం ఆరంభమైన తొలి టెస్టుతో ఆంధ్ర ఆటగాడు కేఎస్‌ భరత్‌ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.  భరత్‌తో పాటు టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ భారత్‌ తరఫున తొలి టెస్టు ఆడుతున్నాడు.

శ్రీకర్‌ భరత్‌  గురించి ఆసక్తికర విషయాలు
►ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన శ్రీకర్‌ భరత్‌ 1993, అక్టోబరు 3న జన్మించాడు.
►2012లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అతడు అరంగేట్రం చేశాడు.
►29 ఏళ్ల శ్రీకర్‌ భరత్‌ కొన్నాళ్లుగా భారత ‘ఎ’ జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా ఉంటున్నాడు.
►2015లో గోవాతో జరిగిన రంజీ మ్యాచ్‌లో భరత్‌ 308 పరుగులు చేసి రంజీల్లో ట్రిపుల్‌ సెంచరీ సాధించి.. రంజీల్లో ఈ ఘనత సాధించిన తొలి కీపర్‌గా నిలిచాడు.

ఐపీఎల్‌లో..
►దూకుడైన బ్యాటర్‌గా పేరొందిన శ్రీకర్‌ భరత్‌ను ఐపీఎల్‌ మినీ వేలం-2021లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సొంతం చేసుకుంది. 20 లక్షలు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది. అంతకుముందు అతడు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌(ఢిల్లీ క్యాపిటల్స్‌)కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, మ్యాచ్‌ ఆడే అవకాశం మాత్రం రాలేదు. 
►ఐపీఎల్‌-2021 సీజన్‌లో కోహ్లి కెప్టెన్సీలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన భరత్‌ 191 పరుగులు సాధించాడు.
►ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భరత్‌ ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి బెంగళూరు జట్టును గెలిపించాడు.
►ఐపీఎల్‌-2023 వేలంలో గుజరాత్‌ టైటాన్స్‌ భరత్‌ను కొనుగోలు చేసింది. 1.2 కోట్ల రూపాయలు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది.

అప్పుడు ఎంపికైనా..
2021లో న్యూజిలాండ్‌తో  టెస్టు సిరీస్‌ నేపథ్యంలో భరత్‌కు మొదటిసారి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. అయితే తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. రెండో మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన భరత్‌.. తన వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు.

అదే విధంగా.. ఇటీవల బంగ్లాదేశ్‌తో పర్యటన సందర్భంగా టెస్టు జట్టుకు ఎంపికైనా.. రెండు మ్యాచ్‌లలోనూ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్‌లో అద్భుత రికార్డు ఉన్న భరత్‌.. ఎట్టకేలకు బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టెస్టుతో జాతీయ జట్టు తరపున ఆడుతుండటం విశేషం.

చదవండి: T20 WC 2023: సిక్సర్ల మోత మోగించిన రిచా.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం

మరిన్ని వార్తలు