అంబుడ్స్‌మెన్‌, అజహార్‌లపై ధ్వజమెత్తిన అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు

7 Jul, 2021 18:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అపెక్స్‌ కౌన్సిల్‌ను రద్దు చేస్తూ అంబుడ్స్‌మెన్‌ జస్టిస్‌ దీపక్‌వర్మ ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు జాన్‌ మనోజ్‌, కార్యదర్శి విజయానంద్‌ ఇతర కౌన్సిల్‌ సభ్యులు బుధవారం ఉప్పల్ స్టేడియంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ను తిరిగి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షునిగా నియమించిన అంబుడ్స్‌మన్‌కు అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేసే అధికారం లేదని కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు జాన్‌ మనోజ్‌ పేర్కొన్నారు. అంబుడ్స్‌మెన్ ఇచ్చిన నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించామని, దానిపై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చిందని ఆయన వెల్లడించారు. 

స్పోర్ట్స్‌మెన్‌గా అజహార్‌కు రెస్పెక్ట్ ఇస్తాం.. కానీ, అతనికి అడ్మినిస్ట్రేషన్ తెలీదని చురకలంటించారు. రేపటి నుండి జరిగే క్రికెట్ లీగ్స్‌కు అజహార్‌కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. అసోసియేషన్ కోసం అందరం కలిసికట్టుగా పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు, అంబుడ్స్‌మెన్‌గా దీపక్‌వర్మ నియామకం చెల్లదని అపెక్స్‌ కౌన్సిల్‌ జనరల్ సెక్రటరీ విజయానంద్ అన్నారు. అతన్ని అంబుడ్స్‌మెన్‌గా తాము ఎన్నికొలేదని పేర్కొన్నారు. ఏప్రిల్‌లో జరిగిన ఏజీఎమ్‌ సమావేశంలో మెజార్టీ సభ్యులు జస్టిస్‌ నిస్సార్‌ అహ్మద్‌ ఖక్రూను అంబుడ్స్‌మన్‌గా ఎన్నుకున్నారని తెలిపారు. 

ఈ నెల 18న అజహార్ నియమించిన జిల్లాల అఫిలియేషన్‌పై నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు. తమ స్పోర్ట్స్ రూంను లాక్ చేశారని, రికార్డులు స్వాధీనం చేసుకున్నారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ విషయమై రేపు లీగ్స్ ప్రారంభించడానికి వచ్చే స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్‌గౌడ్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కేసు విషయమై తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా పడిందని తెలిపారు.

మరిన్ని వార్తలు