Bezawada Tigers: ప్లే ఆఫ్స్‌నకు చేరిన తొలి జట్టుగా బెజవాడ టైగర్స్‌

12 Jul, 2022 10:53 IST|Sakshi

విశాఖ స్పోర్ట్స్‌: ఏపీఎల్‌ టోర్నీ తొలి సీజన్‌ ప్లేఆఫ్‌కు బెజవాడ టైగర్స్‌ జట్టు చేరుకుంది. టోర్నీలో తలపడుతున్న ఆరుజట్లు నాలుగేసి మ్యాచ్‌లు పూర్తిచేయగా.. బెజవాడ టైగర్స్‌ జట్టు 12 పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతోంది. రాయలసీమ కింగ్స్,కోస్టల్‌రైడర్స్, వైజాగ్‌ వారియర్స్‌ ఎనిమిదేసి పాయింట్లతో కొనసాగుతున్నాయి. ఉత్తరాంధ్ర లయిన్స్, గోదావరి టైటాన్స్‌ ఆరేసి పాయింట్లతో టోర్నిలో చివరి మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమవుతున్నాయి.

కాగా బెజవాడ టైగర్స్‌ ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించగా.. మిగిలిన మూడు జట్లు చివరి మ్యాచ్‌లో ఫలితాన్ని బట్టి ప్లేఆఫ్‌కు అర్హత సాధించనున్నాయి. కాగా ఏపీఎల్‌లో మరోసారి వరుణుడి రాకతో సోమవారం జరగాల్సిన మధ్నాహ్నం మ్యాచ్‌ రద్దు అయింది. సాయంత్రం ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరగాల్సిన మ్యాచ్‌ తొమ్మిది ఓవర్లకు కుదించారు.

వైఎస్‌ఆర్‌ స్టేడియంలో మధ్యాహ్నం రాయలసీమ కింగ్స్‌తో బెజవాడ టైగర్స్‌తో తలపడాల్సి ఉండగా ఈ మ్యాచ్‌ రద్దు కావడంతో ఇరుజట్లకు రెండేసి పాయింట్లు కేటాయించారు. కాగా ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌లో మ్యాచ్‌ గెలిచిన జట్టుకు 4 పాయింట్లు లభిస్తాయి. ఫలితం తేలనట్లయితే రెండు పాయింట్లు వస్తాయి.

ఐదు వికెట్ల తేడాతో రైడర్స్‌ విజయం  
ఇక సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో వైజాగ్‌ వారియర్స్‌పై కోస్టల్‌ రైడర్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వైజాగ్‌ వారియర్స్‌ ఓపెనర్‌ గిరినాథ్‌ ఒక పరుగే చేసి వెనుదిరగ్గా మరో ఓపెనర్‌ అశ్విన్‌ 28 పరుగులు చేశాడు. ఓపెనర్లతో పాటు అర్జున్‌ సైతం ఆశిష్‌ బౌలింగ్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. సాయికృష్ణ(13), సిద్ధార్థ(18) మినహా మిగిలిన వారంతా వేగంగా పరుగులు చేయడానికే ప్రయత్నించి సింగిల్‌ డిజిట్‌ స్కోర్ల్‌తోనే పెవిలియన్‌కు చేరారు.

34 పరుగుల వద్ద రెండో వికెట్‌ కూలగా.. చివరికి తొమ్మిది ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 80 పరుగులతో వారియర్స్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. 81 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కోస్టల్‌ రైడర్స్‌ ఓపెనర్లు తపస్వి, కెప్టెన్‌ జ్ఞానేశ్వర్‌ చెరో నాలుగేసి పరుగులు చేసి పెవిలియన్‌కు చేరారు.

మునీష్‌ 9 పరుగులు చేయగా లేఖజ్‌ తొలిబంతికే లేని పరుగుకు రనౌటయ్యాడు. 24పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన స్థితిలో శ్రీనివాస్‌ (38 పరుగులు)కు హర్ష తోడై స్కోర్‌ను పరిగెత్తించారు. హర్ష రెండు ఫోర్లతో 16 పరుగులతోనూ, అబ్బాస్‌ ఒక ఫోర్‌తో ఆరు పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్నందించారు. మరో రెండు బంతులుండగానే రైడర్స్‌ విజయలక్ష్యాన్ని ఛేదించారు.

చదవండి: Ind Vs Eng 1st ODI Details: ముఖాముఖి రికార్డులు, తుది జట్ల అంచనా.. పూర్తి వివరాలు! ఇక టాస్‌ గెలిచిన జట్టు తొలుత..
Surya Kumar Yadav: ప్రపంచ రికార్డు సృష్టించిన సూర్యకుమార్‌ యాదవ్‌! మాక్సీ రికార్డు బద్దలు.. మరెన్నో!

మరిన్ని వార్తలు