APL 2022 Day 1: గోదావరి టైటాన్స్‌, ఉత్తరాంధ్ర లయన్స్‌ శుభారంభం

7 Jul, 2022 14:47 IST|Sakshi

ఏపీఎల్‌కు శ్రీకారం  

విశాఖ స్పోర్ట్స్‌: ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌(ఏపీఎల్‌) మొదటి సీజన్‌ బుధవారం ప్రారంభమైంది. వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో గోదావరి టైటాన్స్, కోస్టల్‌ రైడర్స్‌ జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌ను ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్‌చంద్ర టాస్‌ వేసి ప్రారంభించారు. తొలుత స్టేడియంలో ఏసీఏ, ఏపీఎల్‌ నిర్వాహక బృందాల సమక్షంలో విజేతలకు అందించే ట్రోఫీలను ఆయన ఆవిష్కరించారు.

లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో వరుణుడు ఆగమనం చేశాడు. దీంతో ఊహించని విధంగా కోస్టల్‌ రైడర్స్‌ జట్టు రెండు పరుగుల తేడాతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. టాస్‌ గెలిచిన కోస్టల్‌ రైడర్స్‌ కెప్టెన్‌ జ్ఞానేశ్వర్‌.. గోదావరి టైటాన్స్‌ కెప్టెన్‌ శశికాంత్‌కు బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

శ్రీరాం ఏపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లో సూపర్‌ స్ట్రయికర్‌గా నితీష్‌కుమార్, సూపర్‌ సిక్సర్‌తో జ్ఞానేశ్వర్, సూపర్‌ సేవర్‌గా విమల్‌ కుమార్, బెస్ట్‌ క్యాచర్‌గా గిరీష్‌కుమార్, బెస్ట్‌గా శశికాంత్‌ నిలిచి అతిథుల చేతుల మీదుగా అవార్డులందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ కోశాధికారి ఎస్‌ఆర్‌ గోపీనాథ్‌రెడ్డి, సీఈవో వీరారెడ్డి, సభ్యుడు రెహ్మాన్, వై.సత్యప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

అలా మొదలైంది..  
స్టీఫెన్‌ వేసిన టోర్నీ తొలి బంతిని ఓపెనర్‌ హేమంత్‌ ఎదుర్కొన్నాడు. మూడో బంతికి కవర్‌ మీదుగా బంతిని పంపి సింగిల్‌ తీయడంతో గోదావరి టైటాన్స్‌ పరుగుల ఖాతా ప్రారంభించింది. తర్వాత రెండో బంతిని మరో ఓపెనర్‌ వంశీకృష్ణ లాంగాఫ్‌ మీదుగా తరలించడంతో తొలి బౌండరీ నమోదైంది. తొలి ఓవర్‌(ఆట రెండో ఓవర్‌) వేస్తున్న హరిశంకర్‌ రెండో బంతిని ఆడబోయి స్లిప్‌లో ఉన్న శ్రీనివాస్‌కు క్యాచ్‌ ఇచ్చి హేమంత్‌(1) వెనుతిరగడంతో టోర్నీలో తొలి వికెట్‌ నమోదైంది.

తొలి నాలుగు వికెట్లను 4.4 ఓవర్లలోనే 21 పరుగుల స్కోర్‌కు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్‌ శశికాంత్‌కు నితీష్‌(25) తోడై స్కోర్‌ను ముందుకు నడిపారు. 9.3 ఓవర్లలో 50 పరుగుల మార్కు, 18.3 ఓవర్‌కు వంద పరుగుల మార్కును అందుకోగలిగింది. 17.4 ఓవర్‌లో హరిశంకర్‌ వేసిన బంతిని ఆడబోయి ధీరజ్‌(13) హిట్‌ వికెటై పెవిలియన్‌కు చేరుకున్నాడు.

ఇన్నింగ్స్‌ చివరి బంతిని డీప్‌ ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా శశికాంత్‌ బౌండరీకి తరలించడంతో గోదావరి టైటాన్స్‌ ఆరు వికెట్లకు 115 పరుగులను  చేయగలిగింది. శశికాంత్‌(55) టోర్నీలో తొలి అర్ధ సెంచరీ నమోదు చేసి సాత్విక్‌(5)తో కలిసి అజేయంగా నిలిచాడు. స్టీఫెన్, హరిశంకర్, దీపక్‌ రెండేసి వికెట్లు తీశారు. 

టాస్‌ గెలిచారు.. మ్యాచ్‌ ఓడారు..  
లక్ష్యం చేరుకునేందుకు కోస్టల్‌ రైడర్స్‌ ఇన్నింగ్స్‌ నిదానంగానే ప్రారంభించారు. శశికాంత్‌ వేసిన తొలి ఓవర్‌కు కేవలం ఒక పరుగే చేశారు. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్‌ జ్ఞానేశ్వర్‌ 15 బంతులాడి 20 పరుగులే చేయగా.. మరో ఓపెనర్‌ ప్రణీత్‌ 18 బంతులాడి ఏడు పరుగులే చేశాడు. ఓపెనర్ల స్థానంలో వచ్చిన మునీష్‌ ఆరు బంతులాడి మూడు పరుగులే చేయగా.. తపస్వి మూడు బంతులాడి ఒక పరుగే చేశాడు.

ఏడు ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసిన స్థితిలో వరుణుడు ఆగమనం చేశాడు. వర్షం కారణంగా ఆట ముందుకు సాగకపోవడంతో వీజేడీ పద్ధతిలో విజేతను నిర్ణయించేందుకు ఏడు ఓవర్లకు 35 పరుగుల టార్గెట్‌ విధించారు. దీంతో కోస్టల్‌ రైడర్స్‌ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఏపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌ వరుణుడి రాకతో ఇలా ముగిసింది.

గర్జించిన ఉత్తరాంధ్ర లయన్స్‌ 
ఫ్లడ్‌లైట్ల వెలుతురులో సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మరో మ్యాచ్‌ వర్షం కారణంగా.. 1.45 గంటలు ఆలస్యమైంది. దీంతో 13 ఓవర్ల ఇన్నింగ్స్‌గా నిర్ణయించారు. టాస్‌ గెలిచిన ఉత్తరాంధ్ర లయన్స్‌ ఫీల్డింగ్‌ను ఎంచుకుని రాయలసీమ కింగ్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

ఓపెనర్లు అభిషేక్‌(30) వంశీకృష్ణ(17) జోడి ధాటిగానే బ్యాటింగ్‌ చేయడంతో.. 5.3 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా జట్టు 50 పరుగుల మార్కును చేరింది. తర్వాత రెండు పరుగులు జోడించి ఓపెనర్లు పెవిలియన్‌కు చేరారు. రషీద్‌ ఐదు నిమిషాల పాటు క్రీజ్‌లో ఉండి ఐదు బంతులాడి ఐదు పరుగులు చేసి వెనుతిరిగాడు.

చివర్లో కీపర్‌ పృథ్వీ(8) ఓ భారీ సిక్స్‌ చేసి రనౌటయ్యాడు. కెప్టెన్‌ గిరినాథ్‌ 25 పరుగులతో నిలవగా రాయలసీమ కింగ్స్‌ జట్టు ఏడు వికెట్లకు 99 పరుగులు చేసింది. 100 పరుగుల లక్ష్యంతో ఉత్తరాంధ్ర లయన్స్‌ బరిలోకి దిగి ఓవర్‌ మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి విజయలక్ష్యాన్నందుకుంది.

ఓపెనర్లు గుల్ఫమ్‌ (30), క్రాంతి(10) తొలి రెండు ఓవర్లు ధాటి గానే ఆడి 21 పరుగులు చేశారు. జట్టు 50 పరుగుల మా ర్కును ఓ వికెట్‌ కోల్పోయి 6.5 ఓవర్లలో సాధించింది. 10 ఓవర్లు ముగిసేటప్పటికి మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. తరుణ్‌ 24 పరుగులు చేశాడు.   

చదవండి: Virat Kohli: ఇదే చివరి అవకాశం.. రిపీట్‌ అయితే ప్రపంచకప్‌ జట్టు నుంచి కోహ్లి అవుట్‌!

మరిన్ని వార్తలు