‘అతనే మా ఆయుధం.. దడ పుట్టిస్తాడు: వార్న్‌

1 Oct, 2020 17:00 IST|Sakshi
షేన్‌ వార్న్‌(ఫైల్‌ఫోటో)

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్న ఆసీస్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌.. ఆ జట్టుతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. గతంలో తాను కెప్టెన్‌గా ఉండగా ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన తొలినాటి జ్ఞాపకాలతో పాటు భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌తో షార్జాలోని అనుభవాల్ని షేర్‌ చేసుకున్నాడు. ప్రత్యేకంగా 1998లో సచిన్‌ తుపాన్‌ ఇన్నింగ్స్‌ ఇప్పటికీ తనకు పీడకలగానే ఉంటుందన్నాడు.  ఇక రాజస్తాన్‌ రాయల్స్‌కు మెంటార్‌గా వ్యవహరించడంతో గొప్ప  అనుభూతిని తీసుకొచ్చిందన్నాడు. (చదవండి: అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్‌)

స్టాండ్స్‌లో కూర్చొని మ్యాచ్‌లను వీక్షించడంతో పాటు హెడ్‌ కోచ్‌ మెక్‌ డొనాల్డ్‌, కెప్టెన్‌ స్టీవ్‌  స్మిత్‌లతో మాట్లాడుతూ వారితో చర్చించడం గొప్పగా ఉందన్నాడు. తమ జట్టులో స్మిత్‌ కెప్టెన్సీ స్టైల్‌ను కొనియాడిన వార్న్‌.. జోఫ్రా ఆర్చర్‌ గురించి ప్రధానంగా ప్రస్తావించాడు. తమ జట్టుకు ప్రధాన బౌలింగ్‌ ఆయుధం జోఫ్రా ఆర్చర్‌ అని ప్రశంసించాడు. ప్రత్యర్థులకు దడపుట్టిస్తూ పైచేయి సాధించడంలో ఆర్చర్‌ది భిన్నమైన శైలి అని వార్న్‌ ప్రస్తావించాడు.ఇక సంజూ శాంసన్‌ కూడా మ్యాచ్‌ను శాసింగల సామర్థ్యం ఉన్న ఆటగాడని కొనియాడాడు. 

రెండు దశాబ్డాల క్రితం షార్జా ఎడారిలో సచిన్‌తో నాకు ఎదురైన అనుభవం ఇప్పటికీ పీడకలే. మమ్మల్ని చీల్చి చెండాడిన సచిన్‌ మాకు చేదు జ‍్క్షాపకాల్ని మిగిల్చాడు. ప్రత్యేకంగా నన్ను టార్గెట్‌ చేసి రెచ్చిపోయిన తీరు ఇప్పటికీ నాకు గుర్తు. ఆనాటి రెండు సచిన్‌ ఇన్నింగ్స్‌లు ఇప్పటికీ చిరస్మరణీయమే. నాకు ఇక్కడ ఎదురైన చేదు అనుభవాల్ని చెరిపేశాను. ఇక్కడ ప్రతీ జ్ఞాపకాన్ని మది నుంచి తీసేశాను. ఇప్పుడు రాజస్తాన్‌ రాయల్స్‌ కోసం ఇక్కడికి రావడంతో వాటిని మళ్లీ గుర్తుకొస్తున్నాయి. ఈ సీజన్‌లో షార్జాలో ఆడే మ్యాచ్‌లను రాజస్తాన్‌ గెలుస్తుంది. మా ప్రధాన బౌలింగ్‌ ఆయుధం ఆర్చర్‌. స్టీవ్‌ స్మిత్‌ కెప్టెన్సీ కూడా మాకు బలం. శాంసన్ టాలెంటెడ్‌ క్రికెటర్‌. నేను స్టాండ్స్‌లో కూర్చొని మ్యాచ్‌లను వీక్షిస్తున్నాను. హెడ్‌ కోచ్‌, స్మిత్‌లతో వ్యూహాలని షేర్‌ చేసుకుంటున్నాను. ఇది గొప్పగా అనిపిస్తోంది’ అని వార్న్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు