FIFA WC Final: మెస్సీ మాయ.. అర్జెంటీనాదే వరల్డ్‌కప్‌ 

18 Dec, 2022 21:47 IST|Sakshi

Updates..
► మెస్సీ మాయ.. అర్జెంటీనాదే వరల్డ్‌కప్‌ 
వారెవ్వా ఏమి మ్యాచ్‌.. క్షణక్షణానికి ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. మెస్సీ గోల్‌ కొట్టిన ప్రతీసారి తానున్నానంటూ ఎంబాపె దూసుకొచ్చాడు. నిర్ణీత సమయం ముగిసింది.. అదనపు సమయం ముగిసేలోగా ఇరుజట్లు 2-2తో సమంగా నిలిచాయి. అయితే ఆ తర్వాత మరో 30 నిమిషాలు అదనపు సమయం కేటాయించారు. ఈసారి కూడా 3-3తో సమంగా నిలవడంతో మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. పెనాల్టీ షూటౌట్‌లో మెస్సీ సేన నాలుగు గోల్స్‌ కొట్టగా.. ఫ్రాన్స్‌ రెండో గోల్స్‌​కు మాత్రమే కొట్టగలిగింది. దీంతో అర్జెంటీనా విశ్వవిజేతగా అవతరించింది. 

► ఫ్రాన్స్‌, అ‍ర్జెంటీనా మధ్య జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌ క్షణక్షణానికి చేతులు మారుతుంది. ఆట అదనపు సమయం 108 వ నిమిషంలో మెస్సీ గోల్‌ కొట్టి అర్జెంటీనాను ఆధిక్యంలోకి తెచ్చాడు. అయితే కొద్దిసేపటికే ఫ్రాన్స్‌కు లభించిన పెనాల్టీ కిక్‌ను ఎంబాపె మరోసారి సద్వినియోగం చేసుకున్నాడు. ఆట 118 వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను ఎంబాపె గోల్‌గా మలిచాడు. దీంతో ఇరుజట్ల స్కోర్లు మరోసారి సమం అయ్యాయి.

► అర్జెంటీనా, ఫ్రాన్స్‌ మధ్య జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఉత్కంఠగా కొనసాగుతుంది. నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు 2-2తో సమంగా నిలిచాయి. అదనపు సమయంలోనూ ఎలాంటి గోల్స్‌ నమోదు కాలేదు. అయితే మరోసారి 30 నిమిషాలు అదనపు సమయం ఇచ్చారు. అందులోనూ ఫలితం రాకపోతే అప్పుడు పెనాల్టీ షూటౌట్‌ ద్వారా ఫలితం తేల్చనున్నారు.

► ఫ్రాన్స్‌ సూపర్‌స్టార్‌ కైలియన్‌ ఎంబాపె నిమిషం వ్యవధిలో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆట 80వ నిమిషంలో తొలుత పెనాల్టీని గోల్‌గా మలిచిన ఎంబాపె.. మలి నిమిషం సహచర ఆటగాడు ఇచ్చిన పాస్‌ను చక్కగా వినియోగించుకున్న ఎంబాపె సూపర్‌ గోల్‌తో మెరిశాడు. దీంతో 2-2తో మ్యాచ్‌ను సమం చేసింది.

ఫిఫా వరల్డ్‌కప్‌ కొట్టడానికి అర్జెంటీనా అడుగు దూరంలో ఉంది. తొలి అర్థభాగం ముగిసేసరికి ఫ్రాన్స్‌పై స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన మెస్సీ బృందం 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను అన్నీ తానై నడిపిస్తున్న మెస్సీ కీలకమైన ఫైనల్లో మరోసారి గోల్‌తో మెరిశాడు. ఆట 23వ నిమిషంలో అర్జెంటీనాకు లభించిన పెనాల్టీ కిక్‌ను మెస్సీ సద్వినియోగం చేసుకున్నాడు. 

ఫ్రాన్స్‌ గోల్‌ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ సూపర్‌ గోల్‌తో మెరిసి ఈ వరల్డ్‌కప్‌లో తన గోల్స్‌ సంఖ్యను ఆరుకు పెంచుకున్నాడు. ఇక ఆట 36వ నిమిషంలో ఏంజెల్‌ డి మారియా మరో గోల్‌తో మెరవడంతో అర్జెంటీనా ఖాతాలో రెండో గోల్‌ వచ్చి చేరింది. ఇక రెండో అర్థభాగంలో ఫ్రాన్స్‌ను నిలువరిస్తే చాలు అర్జెంటీనాతో పాటు మెస్సీ కల నెరవేరినట్లే.

మరిన్ని వార్తలు