అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో పెను సంచలనం.. 400కు పైగా స్కోర్‌ నమోదు.. ఇద్దరు సెంచరీలు

14 Oct, 2023 13:16 IST|Sakshi

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో పెను సంచలనం నమోదైంది. అర్జెంటీనా మహిళల జట్టు టీ20ల్లో అత్యధిక టీమ్‌ స్కోర్‌ను నమోదు చేసింది. చిలీతో నిన్న జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా రికార్డు స్థాయిలో 427 పరుగులు (వికెట్‌ నష్టానికి) చేసింది. పొట్టి క్రికెట్‌లో ఇదే అత్యధిక టీమ్‌ స్కోర్‌గా (పురుషులు, మహిళలు) చరిత్రకెక్కింది. గతంలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక టీమ్‌ స్కోర్‌ రికార్డు బెహ్రయిన్‌ మహిళల జట్టు పేరిట ఉండేది. ఆ జట్టు 2022లో సౌదీ అరేబియాపై 318 పరుగులు చేసింది. తాజాగా ఈ రికార్డును అర్జెంటీనా బద్దలుకొట్టింది. పురుషుల క్రికెట్‌ విషయానికొస్తే.. అత్యధిక స్కోర్‌ రికార్డు నేపాల్‌ పేరిట ఉంది. తాజాగా జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో నేపాల్‌ టీమ్‌ 314 పరుగుల రికార్డు స్కోర్‌ చేసింది. 

ఇ‍ద్దరు భారీ సెంచరీలు.. అంతర్జాతీయ టీ20ల్లో తొలిసారి
అంతర్జాతీయ టీ20ల్లో తొలిసారి ఓ రేర్‌ ఫీట్‌ నమోదైంది. ఓ ఇన్నింగ్స్‌లో తొలిసారి రెండు సెంచరీలు నమోదయ్యాయి. చిలీతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా మహిళా క్రికెటర్లు లూసియా టేలర్‌ (84 బంతుల్లో 169; 27 ఫోర్లు), అల్బెర్టీనా గలాన్‌ (84 బంతుల్లో 145 నాటౌట్‌; 23 ఫోర్లు) భారీ శతకాలు బాదారు. వీరితో పాటు మరియా (16 బంతుల్లో 40 నాటౌట్‌; 7 ఫోర్లు) కూడా రాణించడంతో అర్జెంటీనా వికెట్‌ నష్టానికి 427 పరుగులు చేసింది. ఇంత భారీ స్కోర్‌ చేసినా అర్జెంటీనా ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్‌ కూడా లేకపోవడం విశేషం.

టీ20ల్లో ఐదుసార్లు..
అంతర్జాతీయ టీ20ల్లో ఓ ఇన్నింగ్స్‌లో 2 సెంచరీలు నమోదవ్వడం ఇదే తొలిసారి అయితే టీ20ల్లో మాత్రం ఈ ఫీట్‌ ఐదుసార్లు నమోదైంది. 2011లో మిడిల్‌సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లోసెస్టర్‌షైర్‌ ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు తొలిసారి నమోదయ్యాయి. ఆతర్వాత 2016 ఐపీఎల్‌లో ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఏబీ డివిలియర్స్‌, విరాట్‌ కోహ్లి సెంచరీలు చేశారు. ఆతర్వాత బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో, 2019 ఐపీఎల్‌లో (సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు బెయిర్‌స్టో (114), డేవిడ్‌ వార్నర్‌ (100 నాటౌట్‌)), 2022లో బల్గేరియాపై ఇద్దరు చెక్‌ రిపబ్లిక్‌ ప్లేయర్లు ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేశారు.

ఎక్స్‌ట్రాలు 73 పరుగులు..
అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో చిలీ బౌలర్లు రికార్డు స్థాయిలో 73 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో సమర్పించుకున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో ఎక్స్‌ట్రాల రూపంలో ఇన్ని పరుగులు రావడం ఇదే తొలిసారి. 

టీ20ల్లో అతి భారీ విజయం..
అర్జెంటీనా మహిళల జట్టు అంతర్జాతీయ టీ20ల్లో అతి భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అర్జెంటీనా 427 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన చిలీ 63 పరుగులకే ఆలౌటై, 364 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చిలీ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. ఇద్దరు సున్నా స్కోర్లకే పరిమితమయ్యారు. కేవలం ఒక్కరు (27) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. చిలీ ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రాలే (29) అత్యధిక స్కోర్‌ కావడం విశేషం. చిలీ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు రనౌట్లు కావడం మరో విశేషం.

మరిన్ని వార్తలు