Lionel Messi: అర్జెంటీనా బ్యాంక్‌ సంచలన నిర్ణయం..?

22 Dec, 2022 18:43 IST|Sakshi

అర్జెంటీనా సెంట్రల్‌ బ్యాంక్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. 36 ఏళ్ల తర్వాత తమ దేశానికి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ అందించిన లియోనల్‌ మెస్సీ (అర్జెంటీనా కెప్టెన్‌) ఫోటోను తమ దేశ 1000 పెసో (అర్జెంటీనా కరెన్సీ) నోట్లపై ముద్రించేం‍దుకు ప్రపోజల్‌ పంపిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రముఖ దినపత్రిక (ఎల్‌ ఫినాన్సియరో) ఓ ప్రత్యేక కథనం ద్వారా వెల్లడించింది. ఫిఫా వరల్డ్‌కప్‌ 2022 విజయానికి గుర్తుగా అర్జెంటీనా సెంట్రల్‌ బ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ఫ్రాన్స్‌తో ఫైనల్‌ మ్యాచ్‌కు ముందే బ్యాంక్‌ అధికారులు ఇందుకు సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టినట్లు వివరించింది. అయితే, ఈ ప్రచారం అవాస్తవమని ఆ దేశ ఇతర దినపత్రికలు కొట్టిపారేశాయి. కాగా, అర్జెంటీనా 1978లో తొలిసారి వరల్డ్‌కప్‌ గెలిచినప్పుడు ఆ దేశ ప్రభుత్వం నాటి ఫుట్‌బాల్‌ ఆటగాళ్లతో కూడిన కొన్ని స్మారక నాణేలను విడుదల చేసింది. తాజాగా సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ అర్జెంటీనా ప్రతిపాదనతో మెస్సీ ఫోటోను కూడా ఆ దేశ కరెన్సీపై ముద్రించాలని విశ్వవ్యాప్తంగా ఉన్న మెస్సీ ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. 

కాగా, డిసెంబర్‌ 18న ఫ్రాన్స్‌తో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌-2022 ఫైనల్లో అర్జెంటీనా.. ఫ్రాన్స్‌పై 4-2 గోల్స్‌ తేడాతో జయకేతనం ఎగురవేసి, మూడోసారి జగజ్జేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మెస్సీ 2 గోల్స్‌ చేసి అర్జెంటీనా విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

మరిన్ని వార్తలు