IPL 2022: అర్జున్ టెండూల్కర్‌ను అందుకే ఆడించలేదు: షేన్‌ బాండ్‌

3 Jun, 2022 20:12 IST|Sakshi
PC: IPL.com

సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ గత రెండేళ్లుగా ఐపీఎల్‌ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు. ఐపీఎల్‌-2021 మినీ వేలంలో ముంబై ఇండియన్స్‌ అర్జున్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే గతేడాది సీజన్‌ మొత్తం బెంచ్‌కే  అర్జున్ పరిమితమయ్యాడు. ఇక ఐపీఎల్‌-2022 మెగా వేలానికి ముందు ముంబై అతడిని విడిచిపెట్టింది.

కాగా మెగా వేలంలో  మళ్లీ  అతడిని రూ.30 లక్షలకు ముంబై సొంతం చేసుకుంది. దీంతో ఈ ఏడాది సీజన్‌లోనైనా అర్జున్ టెండూల్కర్‌కు జట్టులో చోటు దక్కుతుందని క్రికెట్‌ ఫ్యాన్స్‌ భావించారు. అయితే మరోసారి క్రికెట్‌ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం అతడికి దక్కలేదు. అర్జున్ టెండూల్కర్‌కి ఐపీఎల్ 2022లో ఎందుకు అవకాశం ఇవ్వలేదో తాజాగా  ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్‌ వెల్లడించాడు.

"అర్జున్ ఇంకా చాలా మెరుగుపడాలి. ఏ ఆటగాడైనా జట్టులోకి రావడం  ఒకవంతు అయితే.. ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కాలంటే చాలా కష్టపడాలి. అతడు ఇంకా చాలా వర్కవుట్స్ చేయాల్సి ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో అతడు మరింత రాటుతేలాలి. అతడు బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో పురోగతి సాధించాడని జట్టు భావిస్తే ఖచ్చితంగా అతడికి అవకాశం ఇస్తాం" అని షేన్ బాండ్‌ పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ పేలవ ప్రదర్శన కనబరిచింది. ఆడిన 14 మ్యాచుల్లో 10 పరాజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.
చదవండి: IPL 2022: ఐపీఎల్‌ 2023 ముందు.. ఆ ముగ్గురికి గుడ్‌బై చెప్పనున్న ఎస్‌ఆర్‌హెచ్‌..!

మరిన్ని వార్తలు