Arshdeep Singh: విమర్శించిన వారికి గట్టి సమాధానం​

29 Nov, 2022 17:40 IST|Sakshi

టీమిండియా యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ గతంలో ఆసియా కప్‌ సందర్భంగా ట్రోల్స్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. పాక్‌తో మ్యాచ్‌లో అసిఫ్ అలీ క్యాచ్‌ను జారవిడవడంతో అర్ష్‌దీప్‌ దారుణంగా ట్రోల్‌కు గురయ్యాడు.ఖలిస్థానీ నేషనల్ క్రికెట్ టీమ్‌లో చేరేందుకు ఎంపికయ్యాడంటూ వికీపీడియా పేజీలోని రావడం సంచలనం కలిగించింది. కానీ ఇవన్నీ పట్టించుకోని అర్ష్‌దీప్‌ మాత్రం తనను తాను ఇంప్రూవ్‌ చేసుకుంటూనే వస్తున్నాడు. 

ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌ టీమిండియా తరపున లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. ఆరు మ్యాచ్‌లు కలిపి 10 వికెట్లు పడగొట్టి విమర్శకులకు నోటితోనే సమాధానమిచ్చాడు. టి20 ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 3/32 ప్రదర్శనతో తక్కువ వ్యవధిలోనే డెత్ ఓవర్ స్పెషలిస్టుగా ఎదిగాడు. ఫలితంగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు కూడా ఎంపికయ్యాడు. కివీస్‌తో మూడో వన్డే సందర్భంగా అర్ష్‌దీప్‌ తనపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందించాడు.

"ప్రజలు మమ్మల్ని, మా ఆటను ఎంతగానో ప్రేమిస్తున్నారు. కాబట్టి మేము బెస్ట్ ప్రదర్శన చేస్తే.. వారు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు. ఇదే సమయంలో విఫలమైతే అంతే నిరాశను చూపిస్తారు. భారత్ తరఫున మేము ఆడుతున్నాం కాబట్టి వారు తమ భావోద్వేగాలను ప్రదర్శిస్తున్నారు. అభిమానులకు వారు తమ ప్రేమ, కోపాన్ని వ్యక్తిపరిచే హక్కు ఉంది. కాబట్టి రెండింటినీ మనం అంగీకరించాలి.

ఇక భారత్ తరఫున వన్డే, టీ20లకు ప్రాతినిధ్యం వహించడం ఏ యువకుడికైనా స్వప్నం సాకారమైనట్లుగా భావిస్తాం. నేను నా జర్నీ సులభంగా ఉందని లేక కష్టంగా ఉందని అనుకోవడం లేదు. ఆటగాళ్లుగా ఆటపై దృష్టి పెట్టి ఆ ప్రక్రియను ఆస్వాదించాలి. సులభం, కష్టం వీటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. మేము మా బెస్ట్ ప్రదర్శన చేసినప్పుడు చాలా బాగుంటుంది. ప్రతి మ్యాచ్‌కు మా ఆటతీరును ఉన్నతస్థాయికి తీసుకెళ్తున్నాం. వచ్చే ఏడాదికి నేను ఎక్కడికి చేరాలనేదానిపై ఎక్కువగా ఆలోచించట్లేదు." అని అర్ష్‌దీప్ తెలిపాడు. ఇక కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 0-1 తేడాతో వెనుకంజలో ఉంది. తొలి మ్యాచ్‌లో కివీస్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. మూడో వన్డే బుధవారం నాడు జరగనుంది.

చదవండి: ఫిఫా వరల్డ్‌కప్‌లో వైరలవుతోన్న సంజూ శాంసన్‌ బ్యానర్లు

జట్టు నుంచి ఎవరినైనా తప్పించాల్సి వస్తే, మొదట వచ్చేది సంజూ పేరే..!

మరిన్ని వార్తలు