ICC Award: ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో టీమిండియా పేసర్‌

28 Dec, 2022 19:20 IST|Sakshi

టీమిండియా స్టార్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. బుధవారం ఐసీసీ మెన్స్‌ ఎమర్జింగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2022 అవార్డుకు నామినేట్‌ అయిన ఆటగాళ్ల పేర్లను రిలీజ్‌ చేసింది. ఈ జాబితాలో అర్ష్‌దీప్‌ సింగ్‌తో పాటు సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ మార్కో జాన్సెన్‌, అఫ్గానిస్తాన్‌ ఓపెనర్‌ ఇబ్రహీం జర్దన్‌, న్యూజిలాండ్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌లు నామినేట్‌ అయ్యారు.

అర్ష్‌దీప్‌ సింగ్‌:


టీమిండియాకు ఈ ఏడాది టి20ల్లో లభించిన ఆణిముత్యం అర్ష్‌దీప్‌ సింగ్‌. ముఖ్యంగా టి20 ప్రపంచకప్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా లేని లోటును తీరుస్తూ అర్ష్‌దీప్‌ అద్బుత ప్రదర్శన కనబరిచాడు. ఓవరాల్‌గా ఈ మెగాటోర్నీలో పది వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌ ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో అడుగుపెట్టాడు. మొత్తంగా 21 మ్యాచ్‌లాడి 18.12 సగటుతో 33 వికెట్లు పడగొట్టాడు.

డెత్‌ ఓవర్స్‌లో యార్కర్ల స్పెషలిస్ట్‌గా ముద్రపడిన అర్ష్‌దీప్‌ ఎటువంటి గొడవలు, బెరుకు లేకుండా బౌలింగ్‌ వేసి వికెట్లు పడగొట్టాడు. ఇక టి20 ప్రపంచకప్‌లో మెల్‌బోర్న్‌ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌  బౌలింగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఆరంభంలో తొలి బంతికే బాబర్‌ ఆజంను గోల్డెన్‌ డకౌట్‌ చేసిన అర్ష్‌దీప్‌ తన మరుసటి ఓవర్లో మహ్మద్‌ రిజ్వాన్‌ను పెవిలియన్‌ చేర్చాడు. ఆ తర్వాత డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌కు వచ్చిన అర్ష్‌దీప్‌ ఈసారి ఆసిఫ్‌ అలీని ఔట్‌ చేసి ఓవరాల్‌గా 32 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. 

మార్కో జాన్సెన్‌:


సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ మార్కో జాన్సెన్‌ ఈ ఏడాది టెస్టుల్లో 14 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా, బంగ్లాదేశ్‌లతో జరిగిన వన్డేల్లో మ్యాచ్‌ల్లో పలు వికెట్లు తీసిన జాన్సెన్‌కు ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌ మరిచిపోలేనిది. ఆ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 158 పరుగులకే కుప్పకూలడంలో జాన్సెన్‌ది కీలకపాత్ర. ఆ మ్యాచ్‌లో 35 పరుగులకే ఐదు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ నడ్డి విరిచాడు.

ఇబ్రహీం జర్దన్‌:


ఈ ఏడాది అఫ్గానిస్తాన్‌ ఓపెనర్‌ ఇబ్రహీం జర్దన్‌కు మరిచిపోలేని ఏడాదిగా మిగిలిపోనుంది. ఎందుకంటే జర్దన్‌ ఈ ఏడాది వన్డేల్లో 71.83 సగటుతో 431 పరుగులు.. అలాగే 36.70 సగటుతో టి20ల్లో 367 పరుగులు చేశాడు. ఇ‍క పల్లకెలే వేదికగా లంకతో మ్యాచ్‌లో 162 పరుగుల ఇన్నింగ్స్‌ అతని కెరీర్‌లో మరిచిపోలేనిది. ఆ ఇన్నింగ్స్‌తో అఫ్గాన్‌ తరపున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలోనే మహ్మద్‌ షెహజాద్‌ 131 పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు.

ఫిన్‌ అలెన్‌:


టి20 మెగాటోర్నీ ఆరంభానికి ముందు స్కాట్లాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో భాగంగా 56 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్‌లో 24 బంతుల్లోనే 42 పరుగులు చేసి ఢిపెండింగ్‌ చాంపియన్‌ ఆసీస్‌ ఓటమికి కారణమయ్యాడు. ఇక ఐసీసీ వన్డే సూపర్‌ లీగ్‌లో భాగంగా ఐర్లాండ్‌ టూర్‌లో హాప్‌ సెంచరీతో మెరిసిన అలెన్‌ ఆ తర్వాత ఇండియా, వెస్టిండీస్‌లతో మ్యాచ్‌ల్లోనూ హాఫ్‌ సెంచరీలతో మెరిశాడు.

ఇక మహిళల విభాగంలో ఈ అవార్డుకు టీమిండియా నుంచి ఇద్దరు మహిళా క్రికెటర్లు నామినేట్‌ కావడం విశేషం. పేసర్‌ రేణుకా సింగ్‌తో పాటు వికెట్‌ కీపర్‌ యస్తిక బాటియా ఈ అవార్డు రేసులో ఉన్నారు. వీరిద్దరితో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్‌ డార్సీ బ్రౌన్‌, ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్‌ అలిస్‌ కాప్సీ కూడా పోటీలో ఉన్నారు. ఐసీసీ 2022 అవార్డ్స్‌ను మొత్తంగా 13 కేటగిరీల్లో ఇవ్వనున్నారు. ఇందులో ఐసీసీ మెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచిన ఆటగాడికి ప్రతిష్టాత్మక సర్‌ గార్‌ఫీల్డ్‌ సోబర్స్‌ ట్రోఫీ అందజేయనున్నారు. అలాగే ఐసీసీ మహిళా క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచిన క్రికెటర్‌కు రేచల్‌ హేయో ఫ్లింట్‌ అవార్డు ఇవ్వనున్నారు.

చదవండి: మాట నిలబెట్టుకున్న కేన్‌ మామ.. 722 రోజుల నిరీక్షణకు తెర

మరిన్ని వార్తలు