Arshdeep Singh:  అర్షదీప్‌పై దూషణకు దిగిన గుర్తు తెలియని వ్యక్తి.. ఉతికి ఆరేసిన జర్నలిస్ట్‌

7 Sep, 2022 14:48 IST|Sakshi

ఆసియా కప్‌ సూపర్‌-4 దశలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో క్యాచ్‌ జారవిడిచిన టీమిండియా యువ పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌పై కొందరు దురభిమానులు ముప్పేట దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. అ‍ల్లరి మూకలు.. అర్షదీప్‌ తల్లిదండ్రులను బెదిరించడం, అతన్ని అంతమొందిస్తామని సోషల్‌మీడియాలో కామెంట్లు పెట్టడం, అర్షదీప్‌ వికీపీడియాలో భారత్‌ బదులు ఖలిస్తాన్‌ అని మార్పులు చేయడం వంటి దుశ్చర్యలకు తెగబడ్డారు. 

తాజాగా భారతీయుడిగా చెప్పుకున్న ఓ అగంతకుడు ఓ అడుగు ముందుకేసి అర్షదీప్‌పై నేరుగా దూషణకు దిగాడు. శ్రీలంకతో మ్యాచ్‌ అనంతరం టీమిండియా ఆటగాళ్లు హోటల్‌కు బయల్దేరే క్రమంలో (టీమ్‌ బస్‌ ఎక్కుతుండగా) అక్కడే ఫోన్‌ పట్టుకుని వీడియో తీస్తున్న ఓ వ్యక్తి.. అర్షదీప్‌ డ్రాప్‌ క్యాచ్‌ను ఉద్దేశిస్తూ పంజాబీలో అసభ్యపదజాలం వాడి దూషించాడు. ఇది గమనించిన ఓ స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌.. సదరు వ్యక్తిని అడ్డుకున్నాడు. అర్షదీప్‌ను ఎందుకు దూషిస్తున్నావని నిలదీశాడు. 

అర్షదీప్‌ భారత ఆటగాడని, దేశానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తితో ఇలాగేనా ప్రవర్తించేదని ఎడాపెడా వాయించాడు. ఈ విషయాన్ని అక్కడే సెక్యూరిటీ సిబ్బందికి వివరిస్తుండగా ఆ అగంతకుడు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. 

అగంతకుడు దూషిస్తుండగా.. అర్షదీప్‌ సైతం కాసేపు ఆగి, కౌంటరిద్దామని అనుకున్నట్లున్నాడు. ఎందుకులే లేనిపోని గొడవ అనుకున్నాడో ఏమో.. మారు మాట్లాడకుండా బస్‌ ఎక్కేశాడు. ఈ తతంగం మొత్తానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. అర్షదీప్‌కు అండగా నిలిచిన విమల్‌ కుమార్‌ అనే జర్నలిస్ట్‌ను భారత అభిమానులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇది కదరా దేశ భక్తి, దేశానికి ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్ల పట్ల గౌరవమంటే అంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.   
చదవండి: అంతా అయిపోయింది .. వెళ్లి లాగేజీ సర్దుకోండి! టాటా బై బై!

Poll
Loading...
మరిన్ని వార్తలు