T20 World Cup 2022: భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై అసదుద్దీన్‌ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

22 Oct, 2022 17:34 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో దాయాదుల సమరం ప్రారంభానికి ముందే ఇరు దేశాల మధ్య వాతావరణాన్ని వేడెక్కించింది. వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్‌ వన్డే టోర్నీలో ఆడేందుకు భారత్‌.. పాక్‌లో అడుగుపెట్టబోయేది లేదంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలే ఈ ఉద్రిక్త వాతావరణానికి కారణమయ్యాయి. షా వ్యాఖ్యలకు బెదిరిపోయిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు.. భారత్‌కు కౌంటరిచ్చే ప్రయత్నం చేసింది. ఆసియా కప్‌ ఆడేందుకు భారత్‌ పాక్‌లో అడుగుపెట్టకపోతే.. భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో తామూ కూడా పాల్గొనేది లేదంటూ బెదిరింపులకు దిగింది. కొందరు పాక్‌ ఆటగాళ్లైతే.. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 

ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ స్పందించారు. వికారాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆసియా కప్‌ ఆడేందుకు మనం పాక్‌కు వెళ్లకూడదనుకున్నప్పుడు.. మెల్‌బోర్న్‌లో రేపు (అక్టోబర్‌ 23) ఆ జట్టుతో మ్యాచ్‌ ఎందుకు ఆడాలి.. వదిలేయండి.. పాక్‌తో మ్యాచ్‌ ఆడకుంటే ఏమవుతుంది..? రూ.2,000 కోట్ల నష్టం వస్తుందా..? ఇది మన దేశం కంటే ముఖ్యమా..? అంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. అసదుద్దీన్‌ చేసిన ఈ వ్యాఖ్యలు హైటెన్షన్‌ మ్యాచ్‌కు ముందే వాతావరణాన్ని హీటెక్కిస్తున్నాయి. ఇదిలా ఉంటే, భారత్‌-పాక్‌ల మధ్య మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. 

Poll
Loading...
మరిన్ని వార్తలు