Mitchell Starc: పింక్‌ బాల్‌తో స్టార్క్‌ స్పార్క్‌.. ఆ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా..

18 Dec, 2021 21:40 IST|Sakshi

Ashes 2021 Australia Vs England 2nd Test: పింక్ బాల్‌తో జరిగే డే అండ్‌ నైట్‌ టెస్ట్‌ల్లో ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్‌ స్టార్క్‌ మ్యాజిక్ చేస్తున్నాడు. పింక్‌ బాల్‌తో మరే ఇతర బౌలర్‌కూ సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. యాషెస్‌ సిరీస్‌ 2021-22లో భాగంగా అడిలైడ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన స్టార్క్.. పింక్‌ బాల్‌ టెస్ట్‌ల్లో 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో స్టువర్ట్ బ్రాడ్ వికెట్ పడగొట్టడం ద్వారా స్టార్క్ ఈ ఘనత సాధించాడు. 

ఇప్పటివరకు 9  డే అండ్‌ నైట్ టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన స్టార్క్‌ 18.10 సగటుతో 50 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ఘనతను మూడుసార్లు సాధించాడు. పాక్‌పై 6/66 అతని అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. డే అండ్‌ నైట్‌ టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో స్టార్క్ తర్వాతి స్థానంలో సహచర బౌలర్లు హేజిల్‌వుడ్(13 ఇన్నింగ్స్‌ల్లో 32 వికెట్లు),  నాథన్ లియాన్(16 ఇన్నంగ్స్‌ల్లో 32 వికెట్లు) ఉన్నారు. 

ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆతిధ్య ఆస్ట్రేలియా పట్టుబిగించింది. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 45 పరుగులు చేసి, ఓవరాల్‌గా 282 ప‌రుగుల భారీ అధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగుల వద్ద ఆలౌటైంది. జో రూట్‌(62; 7 ఫోర్లు), మ‌లాన్(80; 10 ఫోర్లు) జట్టును ఆదుకున్నారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 473/9 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన సంగ‌తి తెలిసిందే. తొలి టెస్ట్‌ నెగ్గిన ఆసీస్‌ 5 టెస్ట్‌ల సిరీస్‌లో  1-0 అధిక్యంలో ఉంది.
చదవండి: బీసీసీఐ కీలక అధికారి రాజీనామా

మరిన్ని వార్తలు