Ashes 4th Test Day 1: తొలి రోజు ఆటకు వరుణుడి ఆటంకం

5 Jan, 2022 19:58 IST|Sakshi

యాషెస్ సిరీస్‌ 2021-22లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్ల మధ్య సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌ తొలి రోజు ఆట‌కు వరుణుడు ఆటంకంగా నిలిచాడు. దీంతో తొలి రోజు కేవలం 46.5 ఓవ‌ర్ల ఆట మాత్ర‌మే సాధ్య‌మైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. 

వరుస అంతరాయాల నడుమ సాగిన ఈ ఇన్నింగ్స్‌లో లంచ్‌ విరామం తర్వాత 51 ప‌రుగుల వ‌ద్ద డేవిడ్ వార్న‌ర్‌(30) బ్రాడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం టీ బ్రేక్‌ తర్వాత జ‌ట్టు స్కోర్ 111 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా మార్కస్‌ హ్యారిస్‌(38)ను ఆండ‌ర్స‌న్ బోల్తా కొట్టించాడు. కాసేప‌టికే 117 ప‌రుగుల వ‌ద్ద లబూషేన్‌(28)ను మార్క్ వుడ్ ఔట్ చేశాడు.

ఈ సమయంలో వ‌రుణుడు మ‌ళ్లీ అడ్డుప‌డడంతో అంపైర్లు తొలి రోజు ఆట‌ను నిలిపి వేశారు. క్రీజ్‌లో స్మిత్‌(6), ఖ్వాజా(4) ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ ఓపెన‌ర్ వార్న‌ర్‌ను ఔట్ చేయ‌డం ద్వారా ఇంగ్లండ్ పేస‌ర్ బ్రాడ్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టెస్ట్‌ ఫార్మాట్‌లో వార్న‌ర్‌ను అత్యధిక సార్లు(13) ఔట్ చేసిన బౌలర్‌గా తన రికార్డును తనే మెరుగుపర్చుకున్నాడు. బ్రాడ్ త‌ర్వాత వార్న‌ర్‌ను అత్యధికంగా అశ్విన్, అండ‌ర్స‌న్‌లు పదేసి సార్లు ఔట్ చేశారు.
చదవండి: శార్ధూల్‌ ఠాకూర్‌ పేరు ముందు "ఆ ట్యాగ్‌" వెనుక రహస్యమిదే..!

మరిన్ని వార్తలు