Australia Vs England: ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌ అద్భుత పోరాటం

9 Jan, 2022 15:47 IST|Sakshi

యాషెస్ సిరీస్‌ 2021-22లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్‌ జట్టు తృటిలో మరో ఓటమి నుంచి తప్పించుకుంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ అద్భుత పోరాటపటిమ కనబర్చి మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. ఆఖరి రోజు తొమ్మిది వికెట్లు కోల్పోయిన ఇంగ్లీష్‌ జట్టు చివరి వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి మ్యాచ్‌ను కాపాడుకోగలిగింది. ఆఖర్లో స్టువర్ట్ బ్రాడ్ (35 బంతుల్లో 8 నాటౌట్), జేమ్స్ అండర్సన్ (6 బంతుల్లో 0 నాటౌట్)లు వికెట్‌ కాపాడుకుని జట్టును వైట్‌వాష్‌ గండం నుంచి గట్టెక్కించారు. 

ఆసీస్‌ నిర్ధేశించిన 358 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వికెట్‌ నష్టపోకుండా 30 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. పేలవ బ్యాటింగ్‌ ప్రదర్శనను మరోసారి కొనసాగించింది. టాపార్డర్ మరోసారి దారుణంగా విఫలమైంది. ఓపెనర్ హసీబ్ హమీద్ (9) మరోసారి విఫలమవగా.. డేవిడ్ మలాన్ (4), జో రూట్ (24) వెంటవెంటనే నిష్క్రమించారు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన బెన్ స్టోక్స్ (123 బంతుల్లో 60),  బెయిర్ స్టో (105 బంతుల్లో 41)లు ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. 

అయితే, మూడో సెషన్లో ఆసీస్‌ బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్‌ మిడిలార్డర్ చేతులెత్తేసింది. బెయిర్ స్టో, జాక్ లీచ్ (34 బంతుల్లో 26)లు కాసేపు పోరాడాడు. 270 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ తొమ్మిదో వికెట్‌ను కోల్పోవడంతో అసలు టెన్షన్‌ మొదలైంది. చివరి రోజు ఆటలో కేవలం ఒక్క ఓవర్ మాత్రమే మిగిలుంది. ఆసీస్‌ గెలుపుకు ఒక వికెట్ కావాలి. ఈ సమయంలో బ్రాడ్, అండర్సన్‌లు తమ అనుభవాన్నంతా రంగరించి ఇంగ్లండ్‌ను గట్టెక్కించారు. స్మిత్ వేసిన ఆఖరి ఓవర్ ఆడిన అండర్సన్.. ఆసీస్‌కు వికెట్ దక్కనివ్వలేదు. ఫలితంగా మ్యాచ్‌ డ్రా అయ్యింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన ఉస్మాన్‌ ఖ్వాజాకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. కాగా, 5 టెస్ట్‌ల సిరీస్‌ను ఆసీస్‌ ఇదివరకే 3-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.    

స్కోర్‌ వివరాలు: 
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 416-8 డిక్లేర్డ్ 
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ : 294 ఆలౌట్ 
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 265-6  డిక్లేర్డ్ 
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ : 270-9 
చదవండి: టెస్టుల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన కాన్వే.. తొలి ఆటగాడిగా!

>
మరిన్ని వార్తలు