Ashes: రూట్‌ అందరితో బాగా కలిసిపోతాడు.. అంటే నా కెప్టెన్సీని విమర్శిస్తున్నావా.. లైవ్‌లోనే.. మొయిన్‌ అలీ, కుక్‌..

6 Jan, 2022 18:09 IST|Sakshi
PC: ECB

Alastair Cook and Moeen Ali Heated Discussion: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌, ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ లైవ్‌లోనే వాగ్వాదానికి దిగారు. ఓ స్పోర్ట్స్ షోలో చర్చ సందర్భంగా పరస్పర విమర్శలు చేసుకున్నారు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్టు మొదటి రోజు కవరేజ్‌ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా జో రూట్‌ సారథ్యంలోని జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

మొదటి మూడు టెస్టుల్లో ఓటమి పాలైన ఇంగ్లండ్‌ ట్రోఫీని చేజార్చుకుంది. దీంతో రూట్‌ కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్లుగా కుక్‌, రూట్‌ మధ్య గల వ్యత్యాసాలను ప్రస్తావిస్తూ మొయిన్‌ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రూటీ.. సహచర ఆటగాళ్లతో ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతాడు. వాళ్లతో ఎక్కువ సమయం గడుపుతాడు’’అని పేర్కొన్నాడు. ఇందుకు స్పందించిన కుక్‌.. ‘‘అంటే.. నువ్వు నా కెప్టెన్సీని విమర్శిస్తున్నావా’’అని ప్రశ్నించాడు.

ఇందుకు బదులుగా.. ‘‘అవును... అలాగే అనుకోవచ్చు.. ఇద్దర మధ్య చాలా తేడాలు ఉన్నాయి. కుకీ సారథ్యంలో నేను బాగా బ్యాటింగ్‌ చేయగలను.. అదే రూట్‌ కెప్టెన్సీలో అయితే.. మెరుగ్గా బౌలింగ్‌ చేయగలను’’ అని మొయిన్‌ అలీ చెప్పుకొచ్చాడు.

ఈ సమాధానంతో చిరాకుపడిన కుక్‌... ‘‘నువ్వు నన్ను విమర్శించవచ్చు.. కానీ నిన్ను ఎప్పుడూ జట్టు నుంచి తప్పించలేదు. అదే మరి.. రూట్‌ ఎన్నిసార్లు నిన్ను డ్రాప్‌ చేశాడు?’’ అంటూ గట్టిగానే ప్రశ్నించాడు. మొయిన్‌ అలీ సైతం తగ్గేదేలే అన్న రీతిలో.. ‘‘అవును నిజమే. కానీ నా ఇంటర్నేషనల్‌ కెరీర్‌లో తొలి ఏడాది 1-9 వరకు ఏ స్థానంలో పడితే ఆ స్థానంలో ఆడించావు’’ అని కౌంటర్‌ ఇచ్చాడు. 

ఆపై వారి సంభాషణ సాగిందిలా...
కుక్‌: నేను నీకు చాలాసార్లు అవకాశమైతే ఇచ్చాను. నువ్వు ఎప్పుడు టెయిలెండర్‌గా దిగాలి.. ఎప్పుడు ఓపెనింగ్‌ చేయాలి.. ఏ స్థానానికి నువ్వు పర్‌ఫెక్ట్‌ అన్నది నాకు తెలుసు. జట్టు అవసరానికి తగ్గట్లుగానే నేనలా చేశాను.
అలీ: నేను ఏం అన్నానో నువ్వు అర్థం చేసుకోవాలి. రూటీ సహచర ఆటగాళ్లతో బాగా కలిసిపోతాడన్నది నా అభిప్రాయం. అంతేతప్ప కుకీ అలాంటి వాడు కాదు అని నేను చెప్పలేదు. 
కుక్‌: ఏదేమైనా నీ మాటలను నేను తేలికగా తీసుకోలేను. 

ఇక ఆట విషయానికొస్తే రెండో రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 13 పరుగులు చేసింది. అంతకుముందు ఆసీస్‌ 416 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.

చదవండి: Ashes: రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ... సెంచరీతో సత్తా చాటాడు.. భావోద్వేగం.. వైరల్‌

మరిన్ని వార్తలు