AUS vs ENG: పాపం రూట్‌.. రికార్డు సాధించానన్న ఆనందం లేకుండా

26 Dec, 2021 16:36 IST|Sakshi

యాషెస్‌ సిరీస్‌ ఇంగ్లండ్‌కు ఏ మాత్రం కలిసిరావడం లేదు. ఇప్పటికే వరుసగా రెండు టెస్టుల్లో పరాజయం పాలైన ఇంగ్లండ్‌ మూడోటెస్టును కూడా ఫేలవ రీతిలో ఆరంభించింది. ఓడిన రెండు టెస్టుల్లోనూ బ్యాటింగ్‌ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. తాజాగా మూడో టెస్టులోనూ అదే పునరావృతమైంది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ రూట్‌ మినహా  మిగతావారు పెద్దగా చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేయలేకపోయారు. రూట్‌ మరోసారి అర్థ శతకం(82 బంతుల్లో 50, 4 ఫోర్లు) ఆకట్టుకోగా.. బెయిర్‌ స్టో 35 పరుగులు చేశాడు. అయితే సరిగ్గా 50 పరుగులు చేసి స్టార్క్‌ బౌలింగ్‌లో అలెక్స్‌ క్యారీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఔటయ్యాననే కోపంతో రూట్‌ తన బ్యాట్‌ను కిందకొట్టి అసహనం వ్యక్తం చేసి నిరాశగా పెవిలియన్‌ చేరాడు.  కాగా తాను అర్థసెంచరీ చేసినప్పటికి తన సహచరులెవ్వరు సహకరించలేదన్న కోపమో ఏమోగాని.. రూట్‌ ప్రవర్తన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోనూ క్రికెట్‌ ఆస్ట్రేలియా ట్విటర్‌లో షేర్‌ చేసింది.

చదవండి: Ind Vs Sa 1st Test: తొలి టెస్టు డ్రా అవుతుంది.. ఎందుకంటే: టీమిండియా మాజీ క్రికెటర్‌

ఇక రూట్‌ మూడో టెస్టు ద్వారా టెస్టులో మరో రికార్డును అందుకున్నాడు. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా రూట్‌ చరిత్ర సృష్టించాడు. తాజా హాఫ్‌ సెంచరీతో రూట్‌ ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో 1680 పరుగులు సాధించాడు. తద్వారా దక్షిణాఫ్రికా కెప్టెన్‌ గ్రేమీ స్మిత్‌ రికార్డును బద్దలుకొట్టాడు. ఇక రూట్‌ కంటే ముందు టెస్టు కెప్టెన్‌గా ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు మహ్మద్‌ యూసఫ్‌(1788 పరుగులు, 2006), వెస్టిండీస​  దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌(1710 పరుగులు, 1976) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

ఇక టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెడుతూ పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకున్న ఆసీస్‌ బౌలర్లు బెంబేలెత్తించారు. ఈ దెబ్బకు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ తొలి రోజు రెండు సెషన్లలోనే ముగిసిపోయింది. 65.1 ఓవర్లలో 185 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌట్‌ కాగా.. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌, లియాన్‌ చెరో మూడు వికెట్లు తీయగా.. మిచెల్‌ స్టార్క్‌ 2 వికెట్లు తీశాడు. ప్రస్తుతం తొలిరోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 16 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 61 పరుగులు చేసింది.

చదవండి: Ashes Series 3rd Test: ఆసీస్‌ బౌలర్ల జోరు.. ఇంగ్లండ్‌ విలవిల 

మరిన్ని వార్తలు